జీ20 దేశాల శిఖరాగ్ర సదస్సు 2025, నవంబరు 22న జొహన్నెస్‌బర్గ్‌లో ప్రారంభమైంది. ఇందులో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొని ‘సమ్మిళిత, సుస్థిర ఆర్థికాభివృద్ధి’ అనే అంశంపై ఆయన ప్రసంగించారు. పర్యావరణ సమతౌల్యాన్ని పరిరక్షిస్తూ, సాంస్కృతికంగా సమున్నతంగా ఉంటూ, సామాజిక జీవనాన్ని మెరుగుపరిచేలా ‘ప్రపంచవ్యాప్త సంప్రదాయ విజ్ఞాన నిధి’ని జీ20లో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని మోదీ నొక్కి చెప్పారు.
పునర్వినియోగం, శుద్ధఇంధనం, సుస్థిరతలకు భారత్ పూర్తిగా కట్టుబడి ఉందన్నారు. ‘జీ20 ఓపెన్ శాటిలైట్ డేటా పార్ట్‌నర్‌షిప్’ ఏర్పాటుచేసి, అంతరిక్ష సంస్థల మధ్య సహకారాన్ని అందించుకోవాలని ప్రతిపాదించారు. తద్వారా దక్షిణార్ధగోళ దేశాలకు ఉపగ్రహ సేవలు మరింతగా అందుబాటులోకి వస్తాయన్నారు.