గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికీ కొళాయి ద్వారా రక్షిత మంచినీరు అందించే జల్ జీవన్ మిషన్ పథకం అమలు కాలపరిమితిని కేంద్ర ప్రభుత్వం 2028 డిసెంబరు వరకు పొడిగించింది. 2019-2024 వరకే పరిమితమైన ఈ పథకం చాలా రాష్ట్రాల్లో పూర్తిస్థాయిలో అమలుకాని విషయాన్ని ప్రభుత్వం పరిగణనలో తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన 2026, మార్చి 10న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం దీనిపై నిర్ణయం తీసుకుంది.
ఈ పథకం మొత్తం కేటాయింపులను రూ.8.69 లక్షల కోట్లకు పెంచింది. ఇందులో కేంద్ర ప్రభుత్వ సాయాన్ని 2019-20లో ఆమోదించిన రూ.2.08 లక్షల కోట్ల నుంచి రూ.3.59 లక్షల కోట్లకు పెంచాలని నిర్ణయించింది. దీనివల్ల రాష్ట్రాలకు రూ.1.51 లక్షల కోట్ల అదనపు ప్రయోజనం కలగనుంది.