Published on Oct 21, 2025
Current Affairs
జాబిల్లిపై సూర్యుడి ప్రభావం
జాబిల్లిపై సూర్యుడి ప్రభావం

సూర్యుడి నుంచి వెలువడే ప్రచండ జ్వాలల (కరోనల్‌ మాస్‌ ఎజెక్షన్‌- సీఎంఈ) వల్ల చంద్రుడిపై పడే ప్రభావాన్ని చంద్రయాన్‌-2 వ్యోమనౌక తొలిసారిగా నమోదు చేసింది. చందమామ చుట్టూ ఉన్న పలుచటి వాతావరణం (ఎక్సోస్పియర్‌), దాని ఉపరితలంపై అంతరిక్ష వాతావరణం చూపే ప్రభావాన్ని అర్థం చేసుకోవడానికి ఇది దోహదపడుతుందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) 2025, అక్టోబరు 18న తెలిపింది. 

2019 జులై 22న ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్‌-2లో ఆర్బిటర్‌.. అదే ఏడాది ఆగస్టు 20న విజయవంతంగా చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించింది. అందులో భాగంగా ఉన్న ల్యాండర్‌.. చందమామ ఉపరితలంపై కూలిపోయినా ఆర్బిటర్‌ మాత్రం సేవలు అందిస్తూనే ఉంది. అందులోని చంద్రా అట్మాస్పియరిక్‌ కంపోజిషనల్‌ ఎక్స్‌ప్లోరర్‌-2 (చేస్‌-2) పరికరం.. చంద్రుడి వాతావరణంపై సౌర జ్వాలల ప్రభావాన్ని నిశితంగా పరిశీలించింది.