దివ్యాంగుడైన జాన్ మెక్‌ఫాల్‌కు రోదసియాత్ర చేయడానికి ఆమోదం లభించింది. దీంతో వైకల్యంతో రోదసిలోకి వెళుతున్న తొలి మానవుడిగా ఆయన గుర్తింపు పొందనున్నారు. జాన్ (43) స్వస్థలం బ్రిటన్‌లోని హాంప్‌షైర్.
19 ఏళ్ల వయసులో థాయ్‌లాండ్ పర్యటనలో ఉండగా మోటారు బైకు ప్రమాదంలో కాలు పోగొట్టుకున్నారు. 2005లో పారా అథ్లెట్‌గా మారారు. అనేక పోటీల్లో విజేతగా నిలిచారు. 2008లో బీజింగ్‌లో జరిగిన పారాలింపిక్స్‌లో కాంస్య పతకం గెల్చుకున్నారు.
2022లో ఐరోపా అంతరిక్ష సంస్థ (ఈఎస్‌ఏ)కు చెందిన ‘ఫ్లై’ అనే ప్రాజెక్టులో పాలుపంచుకోవడానికి ఆయనకు అనుమతి లభించింది. వైకల్యమున్న వ్యోమగామిని రోదసిలోకి తీసుకెళ్లడంలో ఉన్న సవాళ్లను అధ్యయనం చేయడం ఈ ప్రాజెక్టు ఉద్దేశం.
భూకక్ష్యలో ఉన్న అంతరాత్జీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్)లో దీర్ఘకాల యాత్ర చేపట్టడానికి జాన్ అర్హుడేనన్న వైద్యపరమైన ధ్రువీకరణ లభ్యమైనట్లు ఈఎస్‌ఏ ప్రకటించింది.
ఆయన ఐఎస్‌ఎస్‌కు పయనమయ్యే తేదీ ఇంకా వెల్లడికాలేదు. పారాఆస్ట్రోనాట్‌గా ఆయన గుర్తింపు పొందనున్నారు.