భారతదేశం విభిన్న మతాలు, జాతులు, భాషలు, సంస్కృతి - సంప్రదాయాలకు నిలయం. ప్రజల మధ్య ఎన్ని భేదాలు ఉన్నప్పటికీ అందరం ఒకటే అనే భావనను పెంపొందించడమే జాతీయ సమైక్యత. దేశ పౌరులు తామంతా భారతీయులం, మాది భారత జాతి అని మానసికంగా అనుకున్నప్పుడే ఇది సాధ్యపడుతుంది. తద్వారా దేశం సుస్థిరంగా, పటిష్టంగా ఉంటుంది. భారతదేశ తొలి మహిళా ప్రధాని ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా మన దేశంలో ఏటా నవంబరు 19న ‘జాతీయ సమైక్యతా దినోత్సవం’గా (National Integration Day) నిర్వహిస్తారు. దేశ ప్రజల్లో ఐక్యత, శాంతి, ప్రేమ, సోదరభావాన్ని పెంపొందించడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.
చారిత్రక నేపథ్యం
ఇందిరా గాంధీ 1917, నవంబరు 19న ఉత్తర్ ప్రదేశ్‌లోని ప్రయాగరాజ్ (ప్రస్తుత అలహాబాద్)లో జన్మించారు. ఆమె ప్రధానిగా ఉన్న సమయంలో దేశ ఐక్యత, సమగ్రత కోసం పాటుపడ్డారు. భారత సమాఖ్య నిర్మాణాన్ని బలోపేతం చేసే దిశగా ఆమె ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. ఇందిరా గాంధీ హయాంలో చేపట్టిన గ్రామీణాభివృద్ధి, పేదరిక నిర్మూలన, అందరికీ విద్య - ఆరోగ్యం లాంటి కార్యక్రమాలు ఎంతగానో ప్రసిద్ధి చెందాయి. దేశాభివృద్ధితోపాటు జాతీయ సమగ్రతలకు ఆమె చేసిన కృషికి గుర్తింపుగా ఏటా ఆమె జయంతిని ‘జాతీయ సమైక్యతా దినోత్సవం’గా జరపాలని ప్రభుత్వం తీర్మానించింది.