శాస్త్రీయ విజ్ఞానం మానవుడి జీవితంలో ఎన్నో మార్పులు తెచ్చింది. రాతి పనిముట్ల నుంచి కృత్రిమ మేధ వినియోగం వరకు సైన్స్ అనేక అద్భుతాలకు కారణమైంది. ప్రాచీన కాలం నుంచే మనదేశంలో విజ్ఞాన శాస్త్ర అభివృద్ధి జరిగింది. ఎందరో శాస్త్రవేత్తలు తమ మార్గదర్శకత్వంతో భారత్‌లో శాస్త్రీయ పురోగతికి కృషి చేశారు. వారిలో సి.వి.రామన్ ఒకరు. ఆయన ఆవిష్కరించిన రామన్ ఎఫెక్ట్ భౌతికశాస్త్రంలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది. రామన్ ఎఫెక్ట్‌ను కనిపెట్టినందుకు గుర్తుగా ఏటా మన దేశంలో ఫిబ్రవరి 28న ‘జాతీయ సైన్స్ దినోత్సవం’గా (National Science Day) ద్చ్వ్శీ నిర్వహిస్తారు. సైన్స్ పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడంతోపాటు సమాజ శ్రేయస్సులో దీని పాత్ర, విజయాలను చాటిచెప్పడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.
చారిత్రక నేపథ్యం
సి.వి.రామన్ 1928, ఫిబ్రవరి 28న ‘రామన్ ఎఫెక్ట్’ను కనుక్కున్నారు. ఈ పరిశోధన భౌతికశాస్త్రంలో ఎంతో ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. భారతదేశ ఖ్యాతి కూడా విశ్వవ్యాప్తమైంది. శాస్త్రీయ రంగంలో సి.వి.రామన్‌తోపాటు ఇతర శాస్త్రవేత్తలు సాధించిన విజయాలను గుర్తించే లక్ష్యంతో ఫిబ్రవరి 28న ‘జాతీయ సైన్స్ దినోత్సవం’గా ప్రకటించాలని 1986లో నేషనల్ కౌన్సిల్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ కమ్యూనికేషన్ (ఎన్‌సీఎస్‌టీసీ) ప్రభుత్వాన్ని కోరింది. దీన్ని భారత ప్రభుత్వం ఆమోదించింది. 1987 నుంచి ప్రతి సంవత్సరం దీన్ని నిర్వహిస్తున్నారు.