వ్యక్తిగత, సామాజిక, కుటుంబ అవసరాల కోసం వస్తువులు లేదా సేవలు పొందే వ్యక్తిని వినియోగదారుడు అంటారు. ప్రతి పరిశ్రమ ద్వారా ఉత్పత్తి చేసే వస్తువు లేదా సేవ అంతిమంగా వినియోగదారుకు చేరాలనే ఉద్దేశంతోనే ఆయా సంస్థలు పనిచేస్తుంటాయి. వీరు లేకపోతే కంపెనీలకు మనుగడే ఉండదు. వినియోగదారులకు నాణ్యమైన వస్తు, సేవలు అందించడం సంస్థల ప్రాథమిక విధి. అయితే వివిధ కంపెనీలు మోసపూరిత ధోరణితో కన్స్యూమర్ల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. మన దేశంలో వినియోగదారుల ప్రయోజనాలను కాపాడే లక్ష్యంతో ఏటా డిసెంబరు 24న ‘జాతీయ వినియోగదారుల దినోత్సవం’గా (National Consumer Day) నిర్వహిస్తారు. దీన్నే ‘జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం’ (National Consumer Rights Day) అని కూడా అంటారు. వినియోగదారుల రక్షణ, సాధికారత, హక్కులపై అవగాహన కల్పించడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.
చారిత్రక నేపథ్యం
భారతదేశంలో అత్యంత ముఖ్యమైన చట్టాల్లో వినియోగదారుల రక్షణ చట్టం 1986 ఒకటి. అన్యాయమైన వాణిజ్య పద్ధతులు, లోపభూయిష్ట వస్తువులు, నాణ్యత లేని సేవల నుంచి వినియోగదారుడిని రక్షించడం దీని లక్ష్యం. దీని అమలుకు ముందు మన దేశంలో వినియోగదారుల సమస్యలకు సరైన పరిష్కారం లేదు. విక్రేతల దోపిడీ అధికంగా ఉండేది. ఈ చట్టం వచ్చాక ఫిర్యాదుల పరిష్కారం వేగవంతం అయ్యింది.
ఈ చట్టాన్ని భారతదేశంలో వినియోగదారుల హక్కుల మాగ్నా కార్టా అని పిలుస్తారు.
ఇది 1986, డిసెంబరు 24న మన దేశంలో అమల్లోకి వచ్చింది. భారత్‌లోని వినియోగదారుల హక్కుల్లో నిర్మాణాత్మక మార్పు తీసుకొచ్చిన ఈ చట్టం అమలైన తేదీని ఏటా ‘జాతీయ వినియోగదారుల దినోత్సవం’గా జరపాలని 2019లో భారత ప్రభుత్వం ప్రకటించింది. 2020 నుంచి ఏటా దీన్ని నిర్వహిస్తున్నారు.