భారత్ అతిపెద్ద లిఖిత రాజ్యాంగం కలిగిన గణతంత్ర రాజ్యం. దేశ ప్రజల ఆశలు, ఆకాంక్షలకు ప్రతిరూపమే మన రాజ్యాంగం. పౌరులు, పాలకులు, పాలనా యంత్రాంగం పాటించాల్సిన అత్యున్నత చట్టంగా దీన్ని పేర్కొంటారు. ఇందులో ప్రభుత్వ విభాగాలు - వాటి స్వరూపం, స్వభావం, లక్ష్యాలు, ఆశయాలను వివరించారు. వ్యక్తి స్వేచ్ఛకు, సర్వతోముఖాభివృద్ధికి రాజ్యాంగం హామీ ఇస్తుంది. భారతదేశ ప్రజాస్వామ్య, లౌకిక, సమానత్వ భావనలను సూచించే ప్రాథమిక పత్రంలా ఇది పనిచేస్తుంది. భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన తేదీకి గుర్తుగా ఏటా నవంబరు 26న ‘జాతీయ రాజ్యాంగ దినోత్సవం’గా (National Constitution Day) నిర్వహిస్తారు. రాజ్యాంగ రచనలో పాలుపంచుకున్నవారిని గౌరవించడం, రాజ్యాంగ సూత్రాలపై ప్రజలకు అవగాహన కల్పించడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.
చారిత్రక నేపథ్యం
రాజ్యాంగ ముసాయిదా కమిటీ రూపొందించిన రాజ్యాంగానికి 1949, నవంబరు 26న ఆమోదం లభించింది. దీంతో ఆ తేదీని ‘జాతీయ రాజ్యాంగ దినోత్సవం’గా జరుపుకోవాలని ప్రభుత్వం భావించింది. 2015 భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ 125వ జయంతి సందర్భంగా జయంతి ఉత్సవాలను ఘనంగా జరపాలని నరేంద్రమోదీ ప్రభుత్వం నిర్ణయించింది. ఆ ఏడాది నుంచి నవంబరు 26ను రాజ్యాంగ దినోత్సవంగానూ ప్రకటించింది. నాటి నుంచి ఏటా దీన్ని నిర్వహిస్తున్నారు.