దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే శక్తి యువతకే ఉంది. దేశ ప్రగతిలో వీరి పాత్ర ఎనలేనిది. కుల, లింగ, ఆర్థిక అసమానతలు లేని సమాజాన్ని నిర్మించడంలో; ప్రజలకు మంచి పాలన అందించడంలో; ఆర్థిక వృద్ధి సాధనలో యువతరం భాగస్వామ్యం కీలకం. జాతీయ శ్రేయస్సులో యువత పోషించే పాత్రను గుర్తించే లక్ష్యంతో ఏటా జనవరి 12న ‘జాతీయ యువజన దినోత్సవం’గా (National Youth Day) నిర్వహిస్తారు. స్వామి వివేకానంద జయంతి కూడా ఈరోజే! సమాజ హితం పట్ల యువకుల్లో స్ఫూర్తి నింపేలా ఆయన అనేక కార్యక్రమాలు చేపట్టారు. మెరుగైన సమాజ నిర్మాణంలో యువతను భాగస్వాములను చేయాల్సిన ఆవశ్యకతను తెలియజేయడంతోపాటు వారు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.
చారిత్రక నేపథ్యం
యువతలో ఉత్తేజాని నింపి, వారు సన్మార్గంవైపు పయనించేలా చేయడంలో వివేకానంద బోధనలు ఎంతగానో తోడ్పడ్డాయి. తరాలు మారినా ఆయన సందేశాలు స్ఫూర్తిని కలిగిస్తూనే ఉన్నాయి. నిస్వార్థంగా దేశసేవకు అంకితం అవ్వండి అని ఆయన ఇచ్చిన పిలుపు ఇప్పటికీ ఎంతో మందికి ఆదర్శంగా నిలిచింది. యువతలో వివేకానం ఆలోచనలు, తత్వాలను ప్రోత్సహించే లక్ష్యంతో ఆయన జన్మదినమైన జనవరి 12న ఏటా ‘జాతీయ యువజన దినోత్సవం’గా జరుపుకోవాలని భారత ప్రభుత్వం 1984లో ప్రకటించింది. 1985 నుంచి ప్రతి సంవత్సరం దీన్ని నిర్వహిస్తున్నారు.
అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని ఏటా ఆగస్టు 12న జరుపుతారు.