Published on Nov 17, 2025
Current Affairs
జాతీయ పత్రికా దినోత్సవం
జాతీయ పత్రికా దినోత్సవం
  • ప్రజలకు సమాచారాన్ని చేరవేసే మాధ్యమాలే పత్రికలు. కేవలం వార్తలను తెలపడమే కాక విజ్ఞానాన్ని, వినోదాన్ని అందిస్తాయి. మన దేశంలో పత్రికలకు ఎన్నో ఏళ్ల చరిత్ర ఉంది. స్వాతంత్య్రోద్యమ సమయంలో బ్రిటిష్‌ వారికి వ్యతిరేకంగా పోరాడటంలో, ఉద్యమకారులను సంఘటితం చేయడంలో ఇవి ముఖ్య భూమిక పోషించాయి. ప్రస్తుత టెలివిజన్, సోషల్‌ మీడియా యుగంలో పత్రికలు ప్రజలకు నిజమైన వార్తలను అందిస్తూ విశ్వసనీయతను మెరుగుపరచుకుంటూనే ఉన్నాయి. మన దేశంలోని స్వేచ్ఛాయుత, బాధ్యతాయుత పత్రికలను గౌరవించుకునే ఉద్దేశంతో ఏటా నవంబరు 16న ‘జాతీయ పత్రికా దినోత్సవం’గా  నిర్వహిస్తారు. ఉన్నత పాత్రికేయ ప్రమాణాలను కాపాడటం; జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సవాళ్లను గుర్తించి, వారిని గౌరవించడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.
  • చారిత్రక నేపథ్యం:
  • భారత్‌లో 1956లో మొదటిసారి వార్తాపత్రికలు ఎదుర్కొనే సమస్యల పరిష్కారానికి చట్టబద్ధమైన సంస్ధ లేదా కమిటీని ఏర్పాటు చేయాలని చర్చ జరిగింది. 1966లో జస్టిస్‌ జె.ఆర్‌.ముధోల్కర్‌ నేతృత్వంలో ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (పీసీఐ) ఏర్పడింది. అదే ఏడాది నవంబరు 16 నుంచి ఇది పని చేయడం ప్రారంభించింది. ఏటా ఇదే తేదీన ‘జాతీయ పత్రికా దినోత్సవం’గా నిర్వహిస్తున్నారు.