మన దేశంలో జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవాన్ని ఏటా ఏప్రిల్ 24న నిర్వహిస్తారు. స్థానిక పాలనా వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వహించడంలో పంచాయతీ రాజ్ సంస్థలు కీలకంగా వ్యవహరిస్తాయి. గ్రామీణాభివృద్ధిని ప్రోత్సహించడంలో, సామాజిక సాధికారతలో వీటి పాత్రను ప్రజలకు తెలియజేయడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.
చారిత్రక నేపథ్యం:
పీవీ నరసింహారావు ప్రభుత్వం పంచాయతీరాజ్ వ్యవస్థకు రాజ్యాంగ భద్రత కల్పించే లక్ష్యంతో 73వ రాజ్యాంగ సవరణ బిల్లును 1991, సెప్టెంబరు 16న పార్లమెంటులో ప్రవేశపెట్టింది. 1992, డిసెంబరు 22న దీనికి ఆమోదం లభించింది. ఈ బిల్లుకు దేశంలోని 17 రాష్ట్రాల శాసనసభలు అంగీకారం తెలిపాయి. ఈ బిల్లుపై అప్పటి రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ 1993, ఏప్రిల్ 20న ఆమోదముద్ర వేయడంతో 73వ రాజ్యాంగ సవరణ, చట్టం (1992)గా మారి 1993, ఏప్రిల్ 24 నుంచి అమల్లోకి వచ్చింది.
దీన్ని పురస్కరించుకుని ఏటా ఏప్రిల్ 24న ‘జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం’గా జరుపుకోవాలని నాటి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం 2010లో నిర్ణయించింది.