మన దేశంలో శాసన, కార్యనిర్వాహక వ్యవస్థలతో సమానంగా న్యాయ వ్యవస్థ కూడా రాజ్యాంగబద్ధంగా ఏర్పాటై, స్వతంత్రంగా పనిచేస్తోంది. వెనుకబడిన ప్రజలకు న్యాయాన్ని చేరువ చేసేలా, పేదలకు న్యాయ సహాయం అందించడం సహా వివిధ కార్యక్రమాలను ఇది చేపట్టింది. ఈ క్రమంలోనే లీగల్ సర్వీసెస్ అథారిటీ చట్టం, 1987ను తీసుకొచ్చింది. దీన్ని ప్రారంభాన్ని గుర్తుచేసుకునేందుకు ఏటా నవంబరు 9న ‘జాతీయ న్యాయ సేవల దినోత్సవం’గా (National Legal Services Day) నిర్వహిస్తారు. ఉచిత న్యాయ సేవల లభ్యత గురించి ప్రజలకు అవగాహన కల్పించడంతోపాటు పౌరులందరికీ సహేతుకమైన పద్ధతిలో న్యాయం అందేలా చూడటం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.
చారిత్రక నేపథ్యం
దేశవ్యాప్తంగా న్యాయ సహాయ కార్యక్రమాలు పర్యవేక్షించేందుకు భారత పార్లమెంట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ 1987ను రూపొందించింది.
1994లో దీనికి కొన్ని సవరణలు చేశారు.
1995, నవంబరు 9న ఈ చట్టం అమల్లోకి వచ్చింది. మాజీ సీజేఐ రంగనాథ్ మిశ్రా దీని అమల్లో ముఖ్య భూమిక పోషించారు.
దీని అమలుకు గుర్తుగా ఏటా నవంబరు 9న ‘జాతీయ న్యాయ సేవల దినోత్సవం’ నిర్వహించాలని సుప్రీంకోర్టు తీర్మానించింది.