ముడి పదార్థాలు ఉపయోగించి.. వివిధ ఉత్పత్తులు లేదా వస్తువులను తయారు చేసే వ్యవస్థను పరిశ్రమ అంటారు. ప్రస్తుత కాలంలో దేశ ప్రగతి, ఆర్థికాభివృద్ధికి ఇవి ఎంతో అవసరం. వీటిలో చిన్న తరహా పరిశ్రమలు స్థానిక ఉత్పత్తుల తయారీలో కీలకంగా ఉన్నాయి. ప్రధానంగా హస్తకళలను ప్రోత్సహిస్తూ, చేతి వృత్తిదారులకు ఆర్థిక స్వావలంబన కల్పిస్తున్నాయి. అంతేకాక కొత్త ఆవిష్కరణలను పెంపొందించడంలో, ఉపాధి కల్పనలో, ఆర్థిక వృద్ధిని ముందుకు తీసుకెళ్లడంలో ఇవి ముఖ్య భూమిక పోషిస్తున్నాయి. దేశాన్ని ఆర్థికంగా బలోపేతం చేయడంతోపాటు సంస్కృతిని కాపాడటంలో ఇవి పోషిస్తోన్న పాత్రను గుర్తుంచుకోవాలనే లక్ష్యంతో ఏటా ఆగస్టు 30న మన దేశంలో ‘జాతీయ చిన్న పరిశ్రమల దినోత్సవం’గా నిర్వహిస్తారు.
చారిత్రక నేపథ్యం:
దేశంలో చిన్నతరహా పరిశ్రమల అభివృద్ధికి మద్దతు కల్పించేందుకు ప్రభుత్వం 2000, ఆగస్టు 30న ఒక సమగ్ర విధాన ప్యాకేజీని ప్రకటించింది. చిన్న పరిశ్రమలకు మౌలిక సదుపాయాల కల్పన, సాంకేతిక అభివృద్ధి, చెల్లింపుల విధానంలో సమస్యలను తీర్చడం దీని ముఖ్య ఉద్దేశం. దీనికి గుర్తుగా ఏటా ఆ తేదీన ‘జాతీయ చిన్న పరిశ్రమల దినోత్సవం’గా నిర్వహించాలని ప్రభుత్వం భావించింది. దీన్ని 2001 నుంచి ఏటా నిర్వహిస్తున్నారు.