ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు ఓటు హక్కు ద్వారా తమకు నచ్చిన వ్యక్తిని చట్టసభలకు ఎన్నుకుంటారు. దీన్ని ఉపయోగించుకోవడం ద్వారా పౌరులు దేశ భవిష్యత్తును నిర్ణయించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తారు. ఇంతటి ప్రాముఖ్యం ఉన్న ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, నిర్బంధరహితంగా నిర్వహించడం ముఖ్యం. రాజ్యాంగ సూత్రాలను కచ్చితంగా అమలు చేస్తూ, న్యాయాధికారాలు చెలాయించే స్వయంప్రతిపత్తి ఉన్న రాజ్యాంగబద్ధ సంస్థతోనే ఇది సాధ్యమవుతుంది. అలా మన దేశంలో ఏర్పాటైందే ‘భారత ఎన్నికల కమిషన్’. దీని స్థాపనకు గుర్తుగా ఏటా జనవరి 25న భారత్‌లో ‘జాతీయ ఓటర్ల దినోత్సవం’గా (National Voters' Day) నిర్వహిస్తారు. ఎన్నికల సమయంలో ఓటర్ల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం, ఓటుహక్కు ప్రాముఖ్యం గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.
చారిత్రక నేపథ్యం
భారత ఎన్నికల సంఘం ఏర్పడి 2010, జనవరి 25 నాటికి 60 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఏటా జనవరి, 25న ‘జాతీయ ఓటర్ల దినోత్సవం’గా నిర్వహించాలని ప్రభుత్వం భావించింది. 2011 నుంచి ప్రతి సంవత్సరం దీన్ని నిర్వహిస్తున్నారు. కొత్తగా ఓటు పొందే వయసు వచ్చిన యువతలో చైతన్యం నింపడం దీని ఆశయం. ఏటా జనవరి 1 నాటికి 18 సంవత్సరాలు నిండిన వారిని గుర్తించి, వారి పేర్లు ఓటరు జాబితాలో చేర్చి, జనవరి 25న ఓటరు గుర్తింపు కార్డులు అందజేస్తున్నారు.