దేశంలో ఇంధన వనరులను సమర్థవంతంగా, తగిన అవగాహనతో, సరైన రీతిలో ఉపయోగించాలనే లక్ష్యంతో ఏటా డిసెంబరు 14న ‘జాతీయ ఇంధన పొదుపు దినోత్సవం’గా (National Energy Conservation Day) నిర్వహిస్తారు. పెరుగుతున్న ఇంధన డిమాండ్ల గురించి వ్యక్తులు, సంస్థలు, పరిశ్రమలకు అవగాహన కల్పించడంతోపాటు శక్తి వనరులను వృథాగా వినియోగించకుండా వాటిని ఆదా చేయాల్సిన ఆవశ్యకతను చాటిచెప్పడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.
చారిత్రక నేపథ్యం
దేశంలో సమర్థవంతమైన ఇంధన వినియోగాన్ని ప్రోత్సహించడంతోపాటు శక్తివనరుల పరిరక్షణ గురించి ప్రజల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో విద్యుత్ మంత్రిత్వ శాఖ (ఎంఓపీ) 1991లో మొదటిసారి డిసెంబరు 14న ‘జాతీయ ఇంధన పొదుపు దినోత్సవం’గా నిర్వహించింది.