Published on Aug 25, 2025
Current Affairs
జాతీయ అంతరిక్ష దినోత్సవం
జాతీయ అంతరిక్ష దినోత్సవం

ఇండియన్‌ స్పేస్‌ రిసెర్చ్‌ ఆర్గనైజేషన్‌ (ఇస్రో) ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌-3 మిషన్‌ విజయానికి గుర్తుగా ఏటా ఆగస్టు 23న ‘జాతీయ అంతరిక్ష దినోత్సవం’గా (National Space Day) నిర్వహిస్తారు.

అమెరికా, రష్యాల కంటే కాస్త ఆలస్యంగా అంతరిక్ష రంగంలోకి అడుగుపెట్టిన భారత్‌ చంద్రయాన్‌-3తో చంద్రుడిపై ల్యాండర్‌ను సాఫీగా దింపిన నాలుగో దేశంగా చరిత్ర సృష్టించింది.

ఇప్పటివరకు అమెరికా, సోవియట్‌ యూనియన్‌ (రష్యా), చైనా మాత్రమే ఈ ఘనత సాధించాయి.

అంతేకాక చంద్రుడి దక్షిణ ధ్రువం పైకి ల్యాండర్, రోవర్‌ను పంపిన మొదటి దేశంగా భారత్‌ అవతరించింది.

అంతరిక్ష రంగంలో భారత ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన చంద్రయాన్‌-3 విజయాన్ని స్మరించుకోవడంతోపాటు అంతరిక్ష పరిశోధనల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.

చారిత్రక నేపథ్యం:

చంద్రుడి దక్షిణ ధ్రువాన్ని చేరుకున్న మొదటి దేశంగా భారత్‌ విజయాన్ని ప్రపంచానికి చాటి చెప్పే లక్ష్యంతో ఏటా ఆగస్టు 23న ‘జాతీయ అంతరిక్ష దినోత్సవం’గా జరుపుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపాదించారు.

దీన్ని మొదటిసారి 2024లో నిర్వహించారు.

2025 నినాదం: "Leveraging Space Technology and Applications for Viksit Bharat 2047."