2026 జనవరి చివరికి దేశంలో చలామణిలో ఉన్న నగదు పరిమాణం జీవనకాల గరిష్ఠమైన రూ.40 లక్షల కోట్లకు చేరినట్లు ఎస్‌బీఐ రిసెర్చ్ తాజా నివేదిక వెల్లడించింది. అయితే అయిదేళ్ల వ్యవధిలో స్థూల దేశీయోత్పత్తితో పోలిస్తే, నగదు నిష్పత్తి 14.4% నుంచి 11 శాతానికి తగ్గినట్లు పేర్కొంది. ఈ నివేదిక ప్రకారం..
కర్ణాటక, పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణ పెరుగుతుంటే, ఆంధ్రప్రదేశ్‌లో క్రమంగా తగ్గుతోంది. 2022-23లో ఏపీలో ఒక్కో ఏటీఎం నుంచి సగటున నెలకు రూ.1.57 కోట్లు విత్‌డ్రా అయ్యేవి. 2025-26 డిసెంబరుకు ఇది రూ.1.34 కోట్లకు తగ్గింది. అంటే డిజిటల్ లావాదేవీలు అధికమయ్యాయి. కానీ, తెలంగాణ, ఏపీలో రూ.100 నోట్ల వినియోగం పెరుగుతోంది. తమిళనాడులో రూ.200 నోట్ల వినియోగం అధికంగా ఉంది.