ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా చెక్కతో రూపొందిన లిగ్నోశాట్ అనే ఉపగ్రహాన్ని జపాన్ ఇటీవల ప్రయోగించింది. అమెరికాలోని ఫ్లోరిడా నుంచి ఈ ప్రయోగం జరిగింది. దీన్ని తొలుత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్)లో ఉంచి 2024 డిసెంబరు మొదటి వారంలో కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు.
లిగ్నోశాట్ ఉపగ్రహాన్ని సుమిటోమో ఫారెస్ట్రీ అనే కలప కంపెనీ భాగస్వామ్యంతో క్యోటో విశ్వవిద్యాలయం రూపొందించింది. దీని వెడల్పు 10 సెంటీమీటర్లు. కిలో బరువు ఉంటుంది. 4 నుంచి 5.5 మిల్లీమీటర్ల మందం కలిగిన మగ్నోలియా చెక్కతో తయారైన ఈ ఉపగ్రహానికి అల్యూమినియం ఫ్రేమ్‌ను అమర్చారు. ఇరువైపులా సౌరఫలకాలను ఏర్పాటు చేశారు. స్క్రూలు, జిగురు వంటివి ఉపయోగించకుండానే సంప్రదాయ జపాన్ విధానాలతో దీన్ని రూపొందించారు. మగ్నోలియా చెక్కను కత్తుల ఒరల తయారీకి ఉపయోగిస్తుంటారు.