ప్రస్తుత ఆధునిక యుగంలో సులభంగా, త్వరితగతిన పనులు చేసేందుకు మానవుడు వస్తువులు/ పరికరాలపై అధికంగా ఆధారపడుతున్నాడు. అవసరం తీరాక వాటిని పారేయడమో లేదా అలాగే ఉంచడమో జరుగుతోంది. ఫలితంగా భూమిపై వ్యర్థాల జాడ అధికమవుతోంది. ఇది ఇలాగే కొనసాగితే పర్యావరణం కాలుష్యం బారిన పడుతుంది. దీన్ని అధిగమించాలంటే రీసైక్లింగ్ (పునఃచక్రీకరణ) చాలా అవసరం. వాతావరణ మార్పు, వనరుల క్షీణతను ఎదుర్కోవడంలో ఇది అత్యంత ప్రభావవంతమైన పరిష్కారాల్లో ఒకటిగా ఉంది. వస్తువుల పునర్వినియోగ ఆవశ్యకతపై ప్రజల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో ఏటా మార్చి 18న ‘గ్లోబల్ రీసైక్లింగ్ డే’గా నిర్వహిస్తారు. భూమిపై నానాటికీ పెరుగుతోన్న కాలుష్యం, వ్యర్థాల గురించి తెలుపుతూ వాటిని తగ్గించడంలో రీసైక్లింగ్ పాత్రను చాటిచెప్పడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.
చారిత్రక నేపథ్యం:
బ్యూరో ఆఫ్ ఇంటర్నేషనల్ రీసైక్లింగ్ (బీఐఆర్) 2015లో దుబాయ్‌లో వరల్డ్ రీసైక్లింగ్ కన్వెన్షన్ అండ్ ఎగ్జిబిషన్ నిర్వహించింది. ఈ సమావేశంలోనే మొదటిసారి ‘గ్లోబల్ రీసైక్లింగ్ డే’ గురించి ప్రతిపాదించారు. బీఐఆర్ 70వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని 2018, మార్చి 18న దీన్ని మొదటిసారి నిర్వహించారు. పర్యావరణ సమతౌల్యాన్ని కాపాడటానికి యూఎన్‌ఓ 17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను ప్రకటించింది. వాటిలో 12వ లక్ష్యం అయిన ‘సుస్థిర వినియోగం, ఉత్పత్తి విధానాల రూపకల్పన’లో ఉన్న రీసైక్లింగ్ ప్రాముఖ్యాన్ని పేర్కొంటూ యూఎన్‌ఓ అదే ఏడాది (2018) ‘గ్లోబల్ రీసైక్లింగ్ డే’కు అధికారిక గుర్తింపు ఇచ్చింది.