76వ గణతంత్ర వేడుకలను పురస్కరించుకుని 2025, జనవరి 26న దిల్లీలోని కర్తవ్యపథ్‌లో నిర్వహించిన ప్రధాన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, సైనిక బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఇండోనేసియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ప్రత్యేకతలు:
త్రివిధ దళాలు సంయుక్తంగా శకటాన్ని తీసుకురావడం ఈసారి ఒక ప్రత్యేకత. అభివృద్ధి ప్రధాన ఇతివృత్తంగా ‘స్వర్ణిమ్ భారత్: విరాసత్ ఔర్ వికాస్’ పేరుతో ప్రత్యేక శకటాలకు రూపకల్పన చేశారు.
రాష్ట్రాలు, కేంద్ర శాఖలకు చెందిన 31 శకటాలను ప్రదర్శించారు.
చరిత్రలో తొలిసారిగా 100 మంది మహిళలు శంఖం, నాదస్వరం, డోలు వంటి సంప్రదాయ సంగీత వాయిద్యాలను వాయిస్తూ కర్తవ్యపథ్‌లో పరేడ్‌ను ప్రారంభించారు.
సైన్యం, నౌకాదళం, వాయుసేనల్లో నారీశక్తిని చాటేలా అధికారిణులు- లెఫ్టినెంట్ కర్నల్ రవీందర్‌జీత్ రంధావా, లెఫ్టినెంట్ కమాండర్ మణి అగర్వాల్, ఫ్లైట్ లెఫ్టినెంట్ రుచి సాహా, కెప్టెన్ సంధ్యా మహ్లా దీనిలో పాల్గొన్నారు.
డీఆర్‌డీవో బృందానికి మహిళా శాస్త్రవేత్త సునీతా జెనా నాయకత్వం వహించారు. సహాయ కమాండెంట్ ఐశ్వర్య జాయ్ నేతృత్వంలోని 148 మంది సభ్యుల సీఆర్పీఎఫ్ మహిళా బృందం, డివిజనల్ సెక్యూరిటీ కమిషనర్ ఆదిత్య నేతృత్వంలోని ఆర్పీఎఫ్ బృందం పరేడ్‌లో పాల్గొన్నాయి. 15 మంది మహిళా పైలట్ల బృందం గగనతల విన్యాసాలతో తమ ప్రతిభను చూపింది.