గుండెకు సంక్లిష్టమైన సొంత నాడీ వ్యవస్థ ఉందని స్వీడన్‌లోని కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్, కొలంబియా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల ఇటీవలి పరిశోధన తేల్చింది.
ఇదో మినీ మెదడులా వ్యవహరిస్తుందని వివరించింది. తలలోని మెదడు.. కదలికలు, శ్వాస లాంటి లయబద్ధ విధులను నియంత్రిస్తున్న రీతిలోనే గుండెలోని ఈ చిన్న బుర్ర కూడా హృదయ స్పందనలను నియంత్రిస్తున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.
ఈ పరిశోధనలో గుండెలోని భిన్నరకాల నాడీ కణాలను శాస్త్రవేత్తలు గుర్తించారు. వాటికి వేర్వేరు బాధ్యతలు ఉన్నట్లు కూడా తేల్చారు.
కొన్ని న్యూరాన్ల సమూహానికి.. గుండె లయను స్థిరంగా ఉంచే పేస్‌మేకర్ లక్షణాలూ ఉన్నట్లు గమనించారు. హృదయ స్పందన రేటు నియంత్రణపై ప్రస్తుతమున్న అభిప్రాయంతో ఈ పరిశోధన విభేదిస్తోంది.