గగన్‌యాన్ ప్రాజెక్టులో భాగంగా వ్యోమగాములను సురక్షితంగా తీసుకొచ్చే పారాచూట్ వ్యవస్థను పరీక్షించడానికి ఇస్రో చేపట్టిన మొదటి సమీకృత ఎయిర్‌డ్రాప్ పరీక్ష (ఐఏడీటీ-1) విజయవంతమైంది.
శ్రీహరికోటలోని షార్ నుంచి సుమారు 5 టన్నుల బరువున్న డమ్మీ క్రూ మాడ్యూల్‌ను చినూక్ హెలికాప్టర్ ద్వారా 2025, ఆగస్టు 24న గగనతలంలోకి తీసుకెళ్లారు.
తీరానికి 35 కి.మీ. దూరంలో మూడు కి.మీ. ఎత్తు నుంచి సముద్రంలో జారవిడిచారు.
తొలుత మాడ్యూల్‌కు అమర్చిన రెండు డ్రోగ్ పారాచూట్లు విచ్చుకుని వేగాన్ని నియంత్రించగా.. ఆ తర్వాత పైలట్ చూట్లు, మరో మూడు ప్రధాన పారాచూట్లు విజయవంతంగా పనిచేశాయి.
బంగాళాఖాతంలో సురక్షితంగా దిగిన క్రూ మాడ్యూల్‌ను నౌకాదళ సిబ్బంది చెన్నై పోర్టుకు తరలించారు.