ప్రమాదవశాత్తు గాయపడి 13ఏళ్ల క్రితం కోమాలోకి వెళ్లిన యువకుడికి కారుణ్య మరణాన్ని ప్రసాదించేందుకు సుప్రీంకోర్టు 2026, మార్చి 11న అనుమతించింది. సర్వోన్నత న్యాయస్థానం ఈ తరహా తీర్పు వెలువరించడం ఇదే మొట్టమొదటిసారి. గౌరవంగా మరణించే హక్కును గుర్తిస్తూ 2018లో వెలువడిన కామన్ కాజ్ కేసు తీర్పును తొలిసారిగా అమలు చేస్తున్నట్లు జస్టిస్ జె.బి.పార్దీవాలా, జస్టిస్ కె.వి.విశ్వనాథన్ ధర్మాసనం ఈ సందర్భంగా పేర్కొంది.
కారుణ్య మరణాలకు సంబంధించి సమగ్ర చట్టాన్ని తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ధర్మాసనం సూచించింది. భావోద్వేగాలతో ముడిపడిన ఈ అంశంలో ఆచరణాత్మకమైన, పొందికైన, స్పష్టమైన రీతిలో ఆ చట్టం ఉండాలని పేర్కొంది.