Published on Jan 18, 2025
Current Affairs
క్రీడా పురస్కారాలు
క్రీడా పురస్కారాలు

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటిన క్రీడాకారులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2025, జనవరి 17న దిల్లీలో క్రీడా పురస్కారాలు అందజేశారు.

2024లో ప్రపంచ పారా అథ్లెటిక్స్‌ 400 మీటర్ల టీ20 విభాగంలో ఛాంపియన్‌గా నిలవడంతో పాటు పారిస్‌ పారాలింపిక్స్‌లో ఇదే విభాగంలో కాంస్యం సాధించిన తెలంగాణకు చెందిన జీవాంజి దీప్తి రాష్ట్రపతి నుంచి అర్జున పురస్కారం అందుకుంది.

2023 ఆసియా అథ్లెటిక్స్‌ 100 మీటర్ల ఛాంపియన్‌గా నిలవడమే కాక అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని పతకాలు సాధించిన, నిరుడు ఒలింపిక్స్‌లోనూ పోటీ పడ్డ ఆంధ్ర అమ్మాయి జ్యోతి యర్రాజి శిక్షణ కోసం దక్షిణాఫ్రికాలో ఉండడంతో అర్జున అవార్డు స్వీకరించలేకపోయింది.

మొత్తం 32 మందిని అర్జున వరించింది. అత్యున్నత పురస్కారం మేజర్‌ ధ్యాన్‌చంద్‌ ఖేల్‌రత్నకు ఈసారి నలుగురు ఎంపికయ్యారు.

ఇటీవలే ప్రపంచ చెస్‌ ఛాంపియన్‌గా అవతరించిన దొమ్మరాజు గుకేశ్‌తో పాటు పారిస్‌ ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన షూటర్‌ మను బాకర్, వరుసగా రెండు ఒలింపిక్స్‌లో కాంస్యాలు సాధించిన హాకీ జట్టులో భాగమైన హర్మన్‌ప్రీత్‌ సింగ్, పారిస్‌ పారాలింపిక్స్‌లో స్వర్ణం గెలిచిన హై జంపర్‌ ప్రవీణ్‌ కుమార్‌ రాష్ట్రపతి నుంచి ఖేల్‌రత్న పురస్కారాలు అందుకున్నారు.