కేంద్ర హోంశాఖ తన 2023-24 వార్షిక నివేదికను 2024, డిసెంబరు 31న విడుదల చేసింది. దీని ప్రకారం భారత సముద్ర తీరం పొడవు 48% పెరిగింది.
ఇండియన్ నావల్ హైడ్రోగ్రాఫిక్ ఆఫీస్, సర్వే ఆఫ్ ఇండియా 1970 డేటా ప్రకారం దేశంలోని 9 రాష్ట్రాలు, 4 కేంద్రపాలిత ప్రాంతాల సముద్రతీరం పొడవు 7,516 కిలోమీటర్ల మేర ఉండగా, తాజాగా నేషనల్ మారిటైం సెక్యూరిటీ కో-ఆర్డినేటర్ నిర్దేశించిన విధివిధానాల ప్రకారం నిర్వహించిన రీ-వెరిఫికేషన్‌లో ఈ పొడవు 11,098.81 కిలోమీటర్లుగా లెక్కతేలింది.
గతంలో నేరుగా ఉన్న దూరాన్నే తీసుకోగా.. రీవెరిఫికేషన్‌లో మలుపులు, వంపులను కూడా లెక్కించడంతో ఈ మొత్తం ఉన్నట్లు తేలింది.
ఇందులో ఆంధ్రప్రదేశ్ తీరప్రాంత పొడవు 973.70 కిలోమీటర్ల నుంచి 1,053.07 కిలోమీటర్లకు (8.15%) పెరిగింది. తమిళనాడు తీరం పొడవు 906.90 కి.మీ. నుంచి 1,068.69 కి.మీ.కి చేరింది.
గుజరాత్ తీరం అత్యధికంగా 92.69%, అండమాన్ నికోబార్ దీవుల తీరం 57.16% మేర పెరిగింది.