కేంద్ర మంత్రి మండలి 2025, డిసెంబరు 12న ‘వికసిత భారత్ శిక్షా అధీక్షణ్ బిల్లు’కు ఆమోదం తెలిపింది. నూతన జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈసీ)లో భాగంగా ఉన్నత విద్యను ఒకే సంస్థ నియంత్రణలోకి తీసుకొచ్చే చర్యల్లో భాగంగా దీన్ని రూపొందించారు. ప్రతిపాదిత బిల్లును తొలుత ‘భారత ఉన్నత విద్యా కమిషన్’(హెచ్‌ఈసీఐ)గా పేర్కొన్నారు. అయితే, తాజాగా దాని పేరును మార్చారు. ప్రస్తుతం విడివిడిగా ఉన్న యూజీసీ, ఏఐసీటీఈ, జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్‌సీటీఈ) నూతన సంస్థ నియంత్రణలోకి వస్తాయి. న్యాయ, వైద్య కళాశాలలను దీని పరిధి నుంచి మినహాయించారు. ప్రధాని అధ్యక్షతన దిల్లీలో సమావేశమైన కేంద్ర కేబినెట్ మరికొన్ని నిర్ణయాలు తీసుకుంది.
దేశవ్యాప్తంగా చేపట్టనున్న జన గణనకు రూ.11,718.24 కోట్లు మంజూరు చేసింది. 2026 ఏప్రిల్ నుంచి సెప్టెంబరు వరకు ఇళ్ల జాబితా రూపకల్పన జరుగుతుంది. 2027 ఫిబ్రవరి నుంచి దేశవ్యాప్తంగా జనగణనతో పాటు కులగణనూ నిర్వహిస్తారు. 30 లక్షల మంది గణకులను నియమిస్తారు. డిజిటల్ పద్ధతిలో జనాభా లెక్కల సేకరణ జరుగుతుంది.