దేశంలో పాల ఉత్పత్తిని పెంచడంతో పాటు పాడి పరిశ్రమకు అవసరమైన ఆధునిక మౌలిక వసతుల కల్పన దిశగా 2025, మార్చి 19న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
సవరించిన రాష్ట్రీయ గోకుల్ మిషన్ (ఆర్జీఎం), నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ డెయిరీ డెవలప్‌మెంట్ (ఎన్‌పీడీడీ) పథకాల ద్వారా చేపడుతున్న వివిధ కార్యక్రమాలకు అదనంగా రూ.2వేల కోట్ల నిధులను కేటాయించింది.
దీంతో ఈ పథకాలకు అందుబాటులోకి వచ్చే నిధుల మొత్తం రూ.6,190 కోట్లకు పెరిగింది. రాష్ట్రీయ గోకుల్ మిషన్‌కు తాజాగా మరో రూ.వెయ్యి కోట్లు కేటాయించింది.
దీంతో ఆర్జీఎం కార్యక్రమానికి 15వ ఆర్థిక సంఘం కాలం(2021-22 నుంచి 2025-26 వరకు)లో వెచ్చించే మొత్తం రూ.3,400 కోట్లకు చేరింది.
ఎన్‌పీడీడీ కార్యక్రమానికి కూడా అదనంగా రూ.వెయ్యి కోట్ల నిధులను సమకూర్చాలని నిర్ణయించడంతో 15వ ఆర్థిక సంఘం కాలంలో వెచ్చించే మొత్తం రూ.2,790 కోట్లకు చేరింది. పాల సేకరణ, సేకరించిన పాల శుద్ధికి అవసరమైన మౌలిక వసతుల ఆధునికీకరణతో పాటు నాణ్యమైన పాడి పశువుల సంతతి వృద్ధికీ ఈ నిధులను వెచ్చించనున్నారు.