కేంద్ర గణాంకాల శాఖ తాజాగా విడుదల చేసిన ‘ఉమెన్ అండ్ మెన్ ఇన్ ఇండియా 2024’ నివేదిక ప్రకారం, జనాభా పెరుగుదల వార్షిక సగటు వృద్ధిరేటు కొన్నేళ్లుగా తగ్గుతుంది. వృద్ధుల సంఖ్య పెరిగిపోతోంది. 1971లో గరిష్ఠంగా 2.2%గా నమోదైన జనాభా పెరుగుదల వార్షిక సగటు వృద్ధిరేటు, 2036 నాటికల్లా 0.58%కు పడిపోనుందని పేర్కొంది. దీనివల్ల దేశంలో వయోవృద్ధుల (60 ఏళ్లు పైబడినవారు) జనాభా బాగా పెరగనుంది. ఫలితంగా- ‘ఆధారపడేవారి నిష్పత్తి’ మారనుంది. ఇప్పటివరకూ పెద్దలపై యువకులు ఆధారపడుతుండగా, ఇకమీదట పిన్నలపై పెద్దలు ఆధారపడే పరిస్థితులు పెరుగుతాయి. చారిత్రకంగా చూస్తే దేశ జనాభా పిరమిడ్ కింది భాగంలో విస్తృతంగా ఉండేది. అంటే పిల్లలు/యువత జనాభా ఎక్కువుండేది. కానీ 2026, 2036 జనాభా అంచనాల ప్రకారం పిరమిడ్ అడుగు భాగం కుంచించుకుపోనుంది. వర్కింగ్ ఏజ్ గ్రూప్ జనాభా పెరగనుంది.