కేంద్ర ప్రభుత్వం 2025-26 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్‌కు 14 పంటల కనీస మద్దతు ధరను పెంచింది.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన 2025, మే 28న దిల్లీలో సమావేశమైన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకొంది.
వరి సాధారణ రకం ధరను క్వింటాల్‌కు రూ.2,369గా, ఏ-గ్రేడ్ ధరను రూ.2,389గా నిర్ణయించింది.
2024 కంటే ఇది రూ.69 ఎక్కువ. 2024-25లో పెరిగిన రూ.117తో పోలిస్తే 41.02% తక్కువ.
ఈ సీజన్‌లో అత్యధికంగా నైగర్‌సీడ్ (గడ్డినువ్వులు) ధర రూ.820, రాగి కనీస మద్దతు ధర రూ.596 పెంచారు.
పత్తి రూ.589, నువ్వులు రూ.579, వేరుసెనగ రూ.480, కంది రూ.450, పొద్దుతిరుగుడు రూ.441, మినుములు రూ.400, జొన్న ధర రూ.328 మేర పెంచారు.
వరి (రూ.69), పెసలు (రూ.86), సజ్జలు (రూ.150), మొక్కజొన్న (రూ.175) ధరల పెరుగుదల కనిష్ఠంగా ఉంది.
వరి, రాగి, జొన్న, పెసలు, వేరుసెనగ, సోయాబీన్, నువ్వులు, నైగర్‌సీడ్, పత్తి పంటల సాగుకయ్యే ఖర్చుపై 50% అదనపు రాబడి వచ్చేలా ఈ ధరలు నిర్ణయించినట్లు ప్రభుత్వం తెలిపింది.
అత్యధికంగా సజ్జపై 63%, మొక్కజొన్న, కందిపై 59%, మినుములపై 53% అదనపు ఆదాయం లభిస్తుందని పేర్కొంది.