Published on Nov 26, 2024
Current Affairs
కేంద్ర క్యాబినెట్‌ నిర్ణయాలు
కేంద్ర క్యాబినెట్‌ నిర్ణయాలు

రైతుల్ని ప్రకృతి సేద్యం వైపు మళ్లించడానికి వీలుగా రాబోయే రెండేళ్లలో రూ.2,481 కోట్లు ఖర్చు చేయడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

2025-26 నాటికి సుమారు కోటి మంది రైతులు 7.5 లక్షల హెక్టార్లలో రసాయనాల రహిత సాగును చేపట్టడానికి ఈ నిధులు వెచ్చిస్తారు.

భూసార నాణ్యతను, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన 2024, నవంబరు 25న జరిగిన క్యాబినెట్‌ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

సుముఖత వ్యక్తంచేసిన పంచాయతీల పరిధిలో 15,000 క్లస్టర్లు ద్వారా ప్రకృతి సేద్యం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. 2019-20 నుంచి ప్రయోగాత్మకంగా చేపట్టిన పనులు ఇప్పటికే 10 లక్షల హెక్టార్లకు విస్తరించాయన్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ 2024, నవంబరు 25న దిల్లీలో అంతర్జాతీయ సహకార కూటమి (ఐసీఏ) గ్లోబల్‌ సదస్సులో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ సహకార సంవత్సరం 2025ను ఆయన ప్రారంభించారు.

సహకార ఉద్యమంలో భారతదేశ నిబద్ధతకు ప్రతీకగా రూపొందించిన స్మారక పోస్టల్‌ స్టాంప్‌నూ ప్రారంభించారు.

ప్రపంచవ్యాప్తంగా సహకార సంఘాలకు మద్దతుగా నిలిచే సరికొత్త భాగస్వామ్య ఆర్థిక నమూనాను సృష్టించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక పురోగతికి ఇది చోదకంగా మారుతుందని తెలిపారు.