అమెరికాలోని విదేశీ విద్యార్థుల్లో వరుసగా రెండోసారి భారత్ అగ్రస్థానంలో నిలిచింది. గత విద్యా సంవత్సరం(2023-24) నాటికి 3.30 లక్షల మంది విద్యార్థులతో భారత్ తొలిస్థానంలో నిలవగా... 2024-25 విద్యా సంవత్సరంలో ఆ సంఖ్య 3.63 లక్షలకు పెరిగి మరోసారి ప్రథమ స్థానాన్ని నిలబెట్టుకుంది. అక్కడున్న విదేశీ విద్యార్థుల్లో ఎన్నో ఏళ్లుగా ప్రథమ స్థానంలో ఉన్న చైనాను మన దేశం 2023-24లో వెనక్కి నెట్టింది. యూఎస్‌ఏకు చెందిన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ తాజాగా విడుదల చేసిన ఓపెన్ డోర్స్ రిపోర్ట్-2025 ద్వారా ఈ వివరాలు వెల్లడయ్యాయి.
అమెరికాలో విద్యా సంవత్సరం అంటే ఆగస్టు-మే నెల వరకు భావిస్తారు. తాజా నివేదికను 2024-25 విద్యా సంవత్సరం గణాంకాల ఆధారంగా రూపొందించారు.