అంతర్జాతీయంగా అత్యంత విలువైన ఐటీ సేవల బ్రాండ్లలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), ఇన్ఫోసిస్ వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. బ్రాండ్ ఫైనాన్స్ సంస్థ ‘ఐటీ సర్వీసెస్ 25 (2026)’ నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. 25 సంస్థలతో విడుదల చేసిన ఈ జాబితాలో అమెరికా, భారత్ నుంచి చెరి 8 సంస్థలున్నాయి. గత 8 ఏళ్లుగా మొదటి స్థానంలో నిలుస్తున్న యాక్సెంచర్, ఈసారీ 42.2 బిలియన్ డాలర్ల (సుమారు రూ.3.80 లక్షల కోట్ల) బ్రాండ్ విలువతో అగ్రస్థానంలో కొనసాగింది.
టీసీఎస్ వరుసగా అయిదో సంవత్సరమూ 21.2 బిలియన్ డాలర్ల (సుమారు రూ.1.91 లక్షల కోట్ల)తో రెండోస్థానంలో నిలిచింది. బ్రాండ్ విలువను ఏటా 15% చొప్పున పెంచుకుంటూ, గత ఆరేళ్లుగా అత్యంత వేగవంతమైన వృద్ధి సంస్థగా నిలిచిన ఇన్ఫోసిస్, 16.4 బిలియన్ డాలర్ల (సుమారు రూ.1.48 లక్షల కోట్ల)తో మూడో స్థానంలో నిలిచింది.