ఐక్యరాజ్యసమితి (ఐరాస) ఒక అంతర్జాతీయ సంస్థ. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత భవిష్యత్తులో ప్రపంచ స్థాయిలో సంభవించే సంఘర్షణలను నివారించే లక్ష్యంతో ఇది ఏర్పడింది. ప్రపంచ శాంతి పరిరక్షణ, అంతర్జాతీయ సహకారం, ప్రపంచ దేశాల మధ్య సమన్వయం, వివిధ సమస్యలను శాంతియుతంగా - చర్చల ద్వారా పరిష్కరించుకోవడం మొదలైన విషయాలపై ఐరాస ప్రధానంగా దృష్టిసారిస్తుంది. దీని ఏర్పాటుకు గుర్తుగా ఏటా అక్టోబరు 24న ప్రపంచవ్యాప్తంగా ఐక్యరాజ్యసమితి దినోత్సవంగా నిర్వహిస్తారు. ప్రపంచ దేశాల మధ్య నెలకొన్న సమస్యలను పరిష్కరించడంతోపాటు అంతర్జాతీయ సహకారం, సంఘీభావాన్ని పెంపొందించడంలో ఐరాస కృషి గురించి తెలియజేయడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.
చారిత్రక నేపథ్యం:
రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచవ్యాప్తంగా శాంతి, స్వేచ్ఛను నెలకొల్పడమే లక్ష్యంగా ‘అట్లాంటిక్ చార్టర్’ను తీసుకొచ్చారు.
దీనిపై 1941, ఆగస్టు 14న అప్పటి బ్రిటన్ ప్రధాని విన్‌స్టన్ చర్చిల్, అమెరికా అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ డి.రూజ్‌వెల్ట్ సంతకాలు చేశారు.
1944లో ‘డంబర్టన్ ఓక్స్’ వద్ద జరిగిన సమావేశంలో అమెరికా, బ్రిటన్, రష్యా, చైనా దేశాల ప్రతినిధులు విస్తృత సంప్రదింపులు జరిపిన అనంతరం ‘ఐక్యరాజ్యసమితి’ అనే అంతర్జాతీయ సంస్థను నెలకొల్పాలని నిర్ణయించారు.
1945, జూన్ 26న శాన్‌ఫ్రాన్సిస్కోలో 50 దేశాలు సమావేశమై ఐక్యరాజ్యసమితి చార్టర్‌ను రూపొందించి, సంతకాలు చేశాయి.
1945 అక్టోబరు 24న ఇది అధికారికంగా అమలై ఐక్యరాజ్య సమితి ఉనికిలోకి వచ్చింది.
దీని ఏర్పాటుకు గుర్తుగా 1948 నుంచి ఏటా అక్టోబరు 24న ‘ఐక్యరాజ్యసమితి దినోత్సవం’గా నిర్వహిస్తున్నారు.