భారతదేశ అటవీ నివేదిక-2023 (ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్)ను కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ 2024, డిసెంబరు 21న విడుదల చేశారు. భారత్‌లో 2021 నుంచి మొత్తం అటవీ, చెట్ల విస్తీర్ణం 1,445 చదరపు కిలోమీటర్లు పెరిగిందని, 2023లో భౌగోళిక ప్రాంతంలో ఇది 25.17 శాతంగా ఉందని నివేదిక వెల్లడించింది. 2021-23 మధ్య కాలంలో పెరిగిన విస్తీర్ణాన్ని పరిగణనలోకి తీసుకుని దీన్ని రూపొందించారు. ఇందులో దేశంలోని అటవీ, చెట్ల విస్తీర్ణంతోపాటు, కర్బన ఉద్గారాల తగ్గింపును కూడా ప్రస్తావించింది.
ఆంధ్రప్రదేశ్‌లో అటవీ విస్తీర్ణం:
ఆంధ్రప్రదేశ్‌లో 2021 ఏడాదితో పోలిస్తే 2023 నాటికి అటవీ విస్తీర్ణం 138.66 చదరపు కిలోమీటర్ల మేర తగ్గినట్లు ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్-2023 వెల్లడించింది.
ఏపీలో 2021లో 30,223.62 చ.కి.మీ. మేర ఉన్న అటవీ విస్తీర్ణం 2023 నాటికి 30,084.96 చ.కి.మీ.కు తగ్గింది.
అత్యధికంగా తగ్గిన రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్ తర్వాత ఏపీ రెండో స్థానంలో ఉంది.
తెలంగాణలో అటవీ విస్తీర్ణం:
తెలంగాణలో 2021-23 మధ్యకాలంలో 100.42 చదరపు కిలోమీటర్ల (చ.కి.మీ.ల) అటవీ విస్తీర్ణం తగినట్లు ‘ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్-2023’ వెల్లడించింది.
2021లో 21,279.46 చ.కి.మీ.లు ఉన్న రాష్ట్ర అటవీ విస్తీర్ణం 2023 నాటికి 21,179.04కు తగ్గింది.
ఈ తరుగుదలలో మధ్యప్రదేశ్ (371.54 చ.కి.మీ.లు), ఆంధ్రప్రదేశ్ (138.66) తర్వాతి స్థానంలో తెలంగాణ నిలిచింది.
2021-23 మధ్యలో రాష్ట్రంలో 33 జిల్లాలకుగాను 13 జిల్లాల్లో అటవీవిస్తీర్ణం తగ్గగా 20 జిల్లాల్లో పెరిగింది.
ఆదిలాబాద్ జిల్లాలో అత్యధికంగా 115.50 చ.కి.మీ.లు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 95.55, నిర్మల్ జిల్లాలో 45.37 చ.కి.మీ.ల మేర అటవీ విస్తీర్ణం తగ్గింది.
జగిత్యాల జిల్లాలో 54.70 చ.కి.మీ.లు, నాగర్ కర్నూల్ జిల్లాలో 50.33, మంచిర్యాల జిల్లాలో 34.96 చ.కి.మీ.ల మేర విస్తీర్ణం పెరిగింది.