Please note, our website will be undergoing scheduled maintenance on Monday, 25th November night from 11:00 PM to 3:00 AM IST (5:30 PM to 9:30 PM UTC) and will be temporarily unavailable. Sorry for the inconvenience.

Published on Nov 12, 2024
Current Affairs
ఏపీ బడ్జెట్‌ రూ.2,94,427 కోట్లు
ఏపీ బడ్జెట్‌ రూ.2,94,427 కోట్లు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ 2024, నవంబరు 11న రూ.2,94,427.25 కోట్ల అంచనా వ్యయంతో 2024-25 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ ప్రతిపాదనలు సమర్పించారు. ఇది ఎన్‌డీఏ కూటమి ప్రభుత్వ తొలి బడ్జెట్‌.

           

              

రంగాలవారీ కేటాయింపులు

వ్యవసాయానికి..

వ్యవసాయ, అనుబంధ రంగాలకు కలిపి రూ.43,402.33 కోట్లు కేటాయించారు. ఇందులో ఉచిత విద్యుత్‌కు రూ.7,241 కోట్లు ఖర్చు చేయనున్నారు. అన్నదాతా సుఖీభవ పథకానికి రూ.1,000 కోట్లు, పంటల బీమాకు రూ.1023 కోట్లు కేటాయించారు. 

‘స్వర్ణాంధ్ర 2047’ కార్యక్రమం ద్వారా 11 ఉద్యాన పంటలను క్లస్టర్‌ విధానంలో ప్రోత్సహిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. 2024-25లో 1.74 లక్షల ఎకరాలను వ్యవసాయ పంటల నుంచి ఉద్యాన పంటల కిందకు తీసుకురావలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. పంటకోత అనంతర నష్టాల నివారణకు సమీకృత ఉద్యాన అభివృద్ధి పథకం కింద రూ.337.41 కోట్లతో కలెక్షన్‌ సెంటర్లు, కోల్డ్‌ రూమ్‌లు మంజూరు చేశారు.

వ్యవసాయ బడ్జెట్‌లో డిజిటల్‌ సేద్యానికి రూ.44.77 కోట్లు ప్రతిపాదించారు. ప్రతి రైతుకు చెందిన వ్యక్తిగత, కుటుంబ, బ్యాంకింగ్, వ్యవసాయ సమాచారాన్ని సేకరించి, ప్రభుత్వ పథకాలతో అనుసంధానించనున్నారు. 

జలవనరులశాఖకు..

రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి 2024-25 బడ్జెట్‌లో మొత్తం 16,705.33 కోట్లు కేటాయించారు. కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుకు ఇచ్చే నిధులతో కలిపి ప్రాజెక్టుల నిర్మాణానికి, జలవనరులశాఖలో ఇతర ఖర్చులకు ఈ నిధులు ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టుకు రూ.5,445 కోట్లు కేటాయించారు.

మైనారిటీల సంక్షేమం..

మైనారిటీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం 2024-25 ఏడాదికిగాను రూ.4,376 కోట్లు కేటాయించింది. మైనారిటీ యువత జీవనోపాధి కల్పనకు స్వయం ఉపాధి రుణాలు మంజూరు చేసేందుకు మైనారిటీ ఆర్థిక సహకార సంస్థకు రూ.173 కోట్లు ప్రతిపాదించింది. ఉర్దూ ఘర్‌ కమ్‌ షాదీఖానాల నిర్మాణం చేపట్టనుంది. ప్రధానమంత్రి జన్‌ వికాస్‌ కార్యక్రమానికి రూ.208 కోట్లు ప్రతిపాదించారు.

ఇతర కేటాయింపులు:

♦ ఇమామ్, మౌజమ్‌ల గౌరవ వేతనాలకు రూ.90 కోట్లు.

♦ పాస్టర్ల గౌరవ వేతనాలకు రూ.29.49 కోట్లు.

♦ క్రైస్తవ ఆర్థిక సహకార సంస్థకు రూ.2.42 కోట్లు.

♦ మైనారిటీ ఆర్థిక సంస్థకు రూ.173 కోట్లు.

♦ ఉర్దూ అకాడమీకి రూ.3.66 కోట్లు.

దళితుల సంక్షేమానికి..

2024-25 బడ్జెట్‌లో ఎస్సీల సంక్షేమానికి రూ.18,497 కోట్లు కేటాయించింది. ప్రతిభావంతులైన దళిత విద్యార్థులు కార్పొరేట్‌ పాఠశాలల్లో విద్యనభ్యసించేలా 2014-19 మధ్య అమలు చేసిన బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్‌ పథకాన్ని పునరుద్ధరించింది. దళిత యువత గత ఐదేళ్లుగా ఎదురుచూస్తున్న కార్పొరేషన్‌ రుణాల మంజూరుకు రూ.341 కోట్లు కేటాయించింది. బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్‌ పథకాన్ని కూటమి ప్రభుత్వం తిరిగి ప్రారంభించేందుకు రూ.30 కోట్లు కేటాయించింది. చర్మకారులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు లిడ్‌క్యాప్‌ సంస్థకు రూ.4 కోట్లు ప్రతిపాదించింది. వైకాపా ప్రభుత్వం నిలిపేసిన బుక్‌ బ్యాంకు పథకానికి రూ.1.62 కోట్లు కేటాయించింది.

ఇతర కేటాయింపులు:

♦ ఎన్టీఆర్‌ విద్యోన్నతి పథకానికి రూ. 51.50 కోట్లు.

♦ అంబేడ్కర్, బాబూ జగ్జీవన్‌రామ్‌ విగ్రహాల ఏర్పాటుకు రూ.50.12 కోట్లు.

♦ ఎస్సీ స్టడీ సర్కిళ్లకు రూ.2.25 కోట్లు.

♦ ఉచిత విద్యుత్తు అమలుకు రూ.300 కోట్లు.

♦ బోధనా రుసుములకు రూ.200 కోట్లు.

♦ ప్రీమెట్రిక్‌ ఉపకార వేతనాలకు రూ.42 కోట్లు.

♦ గురుకులాల్లో మౌలిక వసతుల కల్పనకు రూ.42 కోట్లు.

♦ కేంద్ర పథకాల అనుసంధానంతో గ్రామాలు, వసతిగృహాల్లో మౌలిక వసతులకు రూ.379 కోట్లు.

గిరిజన సంక్షేమం..

ఆదివాసీ గిరిజనుల అభివృద్ధిని కాంక్షిస్తూ ప్రభుత్వం 2024-25 బడ్జెట్‌లో రూ. 7,557 కోట్లు కేటాయించింది. ఐటీడీఏలను గాడిన పెట్టేందుకు రూ. 23.77 కోట్లు ప్రతిపాదించారు.

ఇతర కేటాయింపులు:

♦ ట్రైకార్‌కు రూ.110 కోట్లు, * మౌలిక వసతులకు రూ.125 కోట్లు, *ఉచిత విద్యుత్‌కు రూ.100 కోట్లు, *బోధనా రుసుములకు రూ.128 కోట్లు, *ఉపకార వేతనాలకు రూ. 41 కోట్లు, * గిరిజన పరిశోధనా కేంద్రానికి రూ. 28 కోట్లు, * అంబేడ్కర్‌ విదేశీ విద్యకు రూ. 10 కోట్లు, * విద్యా సంస్థల్లో వసతులకు రూ. 42 కోట్లు.

బీసీ సంక్షేమం..

వెనుకబడిన తరగతుల సంక్షేమానికి 2024-25 బడ్జెట్‌లో రూ.39,007 కోట్లు కేటాయించారు. బీసీల సంక్షేమానికి 15 శాఖలు ఈ నిధుల్ని ఖర్చు చేయనున్నాయి. 

బీసీ కార్పొరేషన్ల ఏర్పాటు లక్ష్యానికి అనుగుణంగా వారికి ఆర్థిక స్వావలంబన కలిగించేలా రూ.896.79 కోట్లు కేటాయించింది. ఈ నిధులను ఉపయోగించి బీసీల్లోని 139 కులాలకు స్వయం ఉపాధి రాయితీ రుణాలు మంజూరు చేయనుంది. బీసీ యువతకు నైపుణ్య శిక్షణ అందించడం, యువ పారిశ్రామికవేత్తలను తయారు చేయడం వంటి కార్యక్రమాలు చేపడతారు.

♦ బీసీ-ఏ కార్పొరేషన్‌కు రూ. 276.24 కోట్లు.

♦ బీసీ-బీ కార్పొరేషన్‌కు రూ. 243.01 కోట్లు.

♦ బీసీ-డీ కార్పొరేషన్‌కు రూ. 284.82 కోట్లు.

♦ బీసీ-ఈ కార్పొరేషన్‌కు రూ. 92.72 కోట్లు కేటాయించారు. 

పౌరసరఫరాల శాఖకు..

పేదలకు బియ్యం, ఏడాదికి మూడు ఉచిత సిలిండర్లు, రాయితీపై ఇతర నిత్యావసరాల పంపిణీకి ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.3,690 కోట్లు ప్రతిపాదించింది. ఇందులో బియ్యం పంపిణీకి రూ.2,344.66 కోట్లు, వంటగ్యాస్‌ రాయితీకి రూ.825 కోట్లు, గడప వద్దకే రేషన్‌ సరఫరాకు రూ.200 కోట్లు ఖర్చు చేయనుంది.  

విమాన రంగానికి..

రాష్ట్రంలో కుప్పం, దగదర్తి, మూలపేటల్లో కొత్తగా విమానాశ్రయాల అభివృద్ధితో పాటు అనంతపురం- తాడిపత్రి మధ్య ఎయిర్‌ స్ట్రిప్‌ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రాజెక్టుల్లో కదలిక తెచ్చేందుకు రూ. 792.72 కోట్లు కేటాయించింది. పౌర విమానయాన రంగంలోని ప్రాజెక్టులకు పెట్టుబడి కింద రూ. 203.30 కోట్లు ఖర్చు చేయడంతో పాటు మరో రూ.300 కోట్లు రుణంగా తీసుకోవాలని భావిస్తోంది. ఈ రంగంపై 2022-23లో జగన్‌ ప్రభుత్వం రూ. 578.09 కోట్లు ఖర్చు చేసింది. 2023-24లో రూ. 667.86 కోట్లు ప్రతిపాదించి, రూ. 470.09 కోట్లు (70 శాతం) మాత్రమే వెచ్చించింది.

ఓడరేవుల్లో మౌలిక సదుపాయాలకు..

రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న ఓడరేవుల అభివృద్ధికి రూ.451.17 కోట్లు కేటాయించింది. ఈ మొత్తంలో రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట ఓడరేవుల అభివృద్ధికి భూసేకరణ, ఇతర అవసరాలకు రూ. 438.28 కోట్లు ఖర్చు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. గత ప్రభుత్వం 2022-23లో రూ.13.52 కోట్లే ఖర్చు చేసింది. 2023-24 బడ్జెట్‌లో రూ. 472.36 కోట్లు కేటాయించినా, వినియోగించింది రూ.12.89 కోట్లు మాత్రమే. 

గురుకులాలు, వసతిగృహాల్లో మౌలిక వసతులకు

♦ వెనుకబడిన తరగతుల విద్యార్థులు చదువుతున్న గురుకులాలు, వసతిగృహాలకు 2024-25 బడ్జెట్‌లో కింది విధంగా కేటాయింపులు చేశారు.

♦ బీసీ గురుకులాలకు ఆర్థిక చేయూత కోసం రూ. 361.64 కోట్లు. 

♦ గురుకులాల భవనాల నిర్మాణానికి రూ.10 కోట్లు.

♦ వసతిగృహాల్లో మౌలిక వసతులకు రూ.25 కోట్లు, కళాశాల వసతి గృహాలకు మరో రూ. 117.75 కోట్లు.

♦ బీసీ భవన్, కమ్యూనిటీ భవనాల నిర్మాణానికి రూ. 10.12 కోట్లు. 2014-19 మధ్య తెదేపా ప్రభుత్వ హయాంలో చేపట్టి పురోగతిలో ఉన్న 3 బీసీ భవన్‌లు, కమ్యూనిటీ భవనాల నిర్మాణాన్ని ఈ నిధులతో పూర్తి చేయనున్నారు.

♦ బీసీ స్టడీ సర్కిళ్ల పునరుద్ధరణకు రూ. 8 కోట్లు. 

♦ విదేశీ విద్యాదరణ పథకానికి రూ. 36.11 కోట్లు. 

పారిశ్రామిక రంగం..

2024-25 బడ్జెట్‌లో పరిశ్రమలు, వాణిజ్యం, మౌలిక సదుపాయాలు, చేనేత, గనుల శాఖకు కలిపి రూ.4,371.42 కోట్లు కేటాయించారు. ఇందులో చెరకు, గిడ్డంగులు, చేనేత, జౌళి, గనుల శాఖలకు రూ.461.92 కోట్లు, ఆయా శాఖల్లోని ఉద్యోగుల జీతాలు, ఇతర ఖర్చులకు రూ.394.82 కోట్లు వెచ్చించనుంది. ఈ మొత్తం పోనూ, రూ.3,514.68 కోట్లు పరిశ్రమలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రతిపాదించింది.   

గత ప్రభుత్వం బకాయి పెట్టిన ప్రోత్సాహకాలను చెల్లించేందుకు వీలుగా చిన్న, భారీ పరిశ్రమలకు రూ.2,270.79 కోట్లు కేటాయించింది. ఈ మొత్తంలో రెవెన్యూ, క్యాపిటల్‌ వ్యయాల కింద రూ.1,428.96 కోట్లు, రూ.841.82 కోట్లు వెచ్చించనుంది. చిన్న, భారీ పరిశ్రమలకు ప్రోత్సాహక బకాయిలు చెల్లించే రూ.1,385.26 కోట్లను రెవెన్యూ వ్యయం కింద పేర్కొన్నట్లు అధికారులు తెలిపారు. 

విద్యారంగం..

♦ 2024-25 ఆర్థిక సంవత్సరంలో విద్యారంగానికి కేటాయింపులు కింది విధంగా ఉన్నాయి.

♦ టీచింగ్‌ గ్రాంట్స్‌కు రూ.18,397.48 కోట్లు

♦ సమగ్ర శిక్షకు రూ.3,507.31 కోట్లు

♦ డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకానికి రూ.1,854.03 కోట్లు

♦ మన బడి మన భవిష్యత్తుకు రూ.1,000 కోట్లు

ఆరోగ్య రంగం..

2024-25 రాష్ట్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి కూటమి ప్రభుత్వం రూ.18,421 కోట్లు కేటాయించింది. 2023-24లో గత వైకాపా ప్రభుత్వం రూ.15,882 కోట్లు కేటాయించింది. 

వైద్య కళాశాలలకు, ఎన్టీఆర్‌ వైద్య సేవ ట్రస్టు అవసరాలకు వైకాపా ప్రభుత్వం రూ.2,732.38 కోట్లను కేటాయిస్తే కూటమి ప్రభుత్వం రూ.4 వేల కోట్లను ప్రతిపాదించింది. అంటే అదనంగా మరో 1,349 కోట్లు కేటాయించారు. ఆసుపత్రులో మందుల కొనుగోళ్ల కోసం ఈ బడ్జెట్‌లో రూ.600 కోట్లను ప్రతిపాదించారు.. కిందటేడు ఈ మొత్తం రూ.391.08 కోట్లు మాత్రమే. ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం ఈ బడ్జెట్‌లో రూ.2,431 కోట్లను ప్రతిపాదించారు. 

డైరెక్టరేట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ పరిధిలో పనిచేసే బోధనాసుపత్రుల్లో అవసరాలకు రూ.9,177.55 కోట్లను కేటాయించారు. వైకాపా ప్రభుత్వ హయాంలో (గత ఏడాది) ఈ కేటాయింపు రూ.7,220.99 కోట్లు మాత్రమే. బోధనాసుపత్రుల్లో అడ్వాన్స్‌డ్‌ రేడియాలజీ సర్వీసెస్‌ కోసం రూ.80.00 కోట్లను కేటాయించారు. శానిటేషన్, సెక్యూరిటీ, పెస్ట్‌ కంట్రోలు సేవలకు రూ.240.96 కోట్లు ఇచ్చారు. గత బడ్జెట్‌లో ఈ మొత్తం రూ.218.49 (9.79%)కోట్లుగా ఉంది.  

ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ అవసరాలకు గత బడ్జెట్‌లో రూ.4,676 కోట్లను ప్రతిపాదిస్తే..ఈ ప్రభుత్వం రూ.4,828 కోట్లను కేటాయించింది. 15వ ఆర్థిక కమిషన్‌ గ్రాంట్స్‌ కింద రూ.876 కోట్లను కేటాయిస్తున్నట్లు ఈ ప్రభుత్వం ప్రకటించింది. గత ఏడాది ఇది రూ.525 కోట్లుగా ఉంది. మానవ వనరుల అభివృద్ధి కోసం ఈ బడ్జెట్‌లో రూ.1,117 కోట్లు ఇచ్చారు. 

కొత్త, పూర్వ వైద్య కళాశాలల నిర్మాణ అవసరాలకు రూ.859.02 కోట్లను ఈ బడ్జెట్‌లో  కేటాయించారు. ఇందులో రూ.45 కోట్లు నంద్యాల, ఏలూరు, రాజమహేంద్రవరం కళాశాలల్లో పరికరాల కోసం ఖర్చుపెడతారు. వైకాపా ప్రభుత్వ కంటే కూటమి ప్రభుత్వం ఈ బడ్జెట్లో వైద్య కళాశాలలకు అదనంగా రూ.220 కోట్లు కేటాయించింది. 

ఆడబిడ్డ నిధి పథకానికి..

19 ఏళ్ల నుంచి 59 ఏళ్ల మధ్య ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన మహిళలకు నెలకు రూ.1,500 చొప్పున ఆర్థికసాయం అందిస్తామని కూటమి పార్టీలు ఎన్నికల్లో ప్రకటించాయి. ‘మహిళలకు ఆర్థిక సహకారం’ పేరుతో ఆయా వర్గాలకు చెందిన వారికి 2024-25 బడ్జెట్‌లో ప్రభుత్వం రూ.3,341.82 కోట్లు కేటాయించింది. బీసీ మహిళలకు రూ.1099.78 కోట్లు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రూ.629.37 కోట్లు, మైనారిటీలకు రూ.83.79 కోట్లు, ఎస్సీ మహిళలకు రూ.1198.42 కోట్లు, గిరిజన మహిళలకు రూ.330.10 కోట్లు ప్రతిపాదించింది. జెండర్‌ బడ్జెట్‌లో ఈ నిధుల్ని ప్రత్యేకంగా చూపించింది.

♦ ముఖ్యాంశాలు..

♦ 2024-25 బడ్జెట్‌లో రహదారుల పునర్నిర్మాణానికి రూ.5,441 కోట్లు కేటాయించారు. గ్రామాల్లో పంచాయతీరాజ్‌ రోడ్ల నిర్మాణానికి రూ.1,936 కోట్ల నిధులిచ్చారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖకు రూ.16,739 కోట్లు కేటాయించారు. 

♦ 2024-25 వార్షిక బడ్జెట్‌లో జలజీవన్‌ మిషన్‌ పథకానికి రూ.1,420.12 కోట్లు కేటాయించారు. 

♦ చంద్రన్న బీమాకు ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.280.82 కోట్లు కేటాయించింది. 

♦ పేదల ఇళ్లలో చదువుకునే ప్రతి విద్యార్థికి రూ.15 వేల చొప్పున సాయం చేస్తామని మ్యానిఫెస్టోలో ప్రకటించింది. దీనికోసం ‘తల్లికి వందనం’ పథకానికి రూ.6,487 కోట్లు కేటాయించింది.

♦ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ పథకాలకు, వారికి సంబంధించిన మౌలిక సౌకర్యాల కల్పనకు కలిపి రూ.69,437 కోట్లు కేటాయించింది. అధికారంలోకి వచ్చిన వెంటనే డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ పథకాన్ని రూ.10 లక్షల వరకు అమలు చేస్తామని ఇచ్చిన హామీ అమలుకు రూ.1,250 కోట్లు ఇచ్చింది. 

♦ పేదల గృహ నిర్మాణం కోసం రూ.4,012 కోట్లు నిధులు చూపింది. పట్టణాల్లో జీ ప్లస్‌ 3 తరహాలో నిర్మిస్తున్న టిడ్కో ఇళ్లకు రూ.1,089 కోట్లు కేటాయించారు.

♦ ‘ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన-గ్రామీణ్‌’ పథకం కింద ఇళ్ల నిర్మాణానికి 2024-25లో రూ.4,012 కోట్లు కేటాయించింది. 

♦ అమరావతి మెట్రో రైల్‌ కార్పొరేషన్‌కు 2024-25 వార్షిక బడ్జెట్‌లో రూ.50 కోట్లు కేటాయించారు.

♦ వైఎస్సార్‌ జిల్లా కడప ఉక్కు కర్మాగారం ప్రతిపాదనను ముందుకు తీసుకెళ్లేలా ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.25 కోట్లు కేటాయించింది.

♦ ఇంధన రంగానికి ప్రభుత్వం రూ.8,207.65 కోట్లు కేటాయించింది.

♦ అమరావతి రాజధాని నిర్మాణానికి, భూములిచ్చిన రైతులకు ఇవ్వాల్సిన ప్రోత్సాహకాలకు కలిపి రూ.3,445 కోట్లు కేటాయించారు.