భారతదేశ ఆర్థిక వృద్ధి మూడు ఆర్థిక సంవత్సరాల (2024-25, 2025-26, 2026-27) వరకు 6.5-7 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేసే అవకాశం ఉందని ఎస్ అండ్ పీ గ్లోబల్ రేటింగ్స్ అంచనా వేసింది.
మౌలిక సదుపాయాల కల్పనపై వ్యయాలు, ప్రైవేటు వినియోగం పెరుగుతుండటం వృద్ధికి ఊతమిస్తాయని పేర్కొంది. మంచి ఆర్థిక వృద్ధి బ్యాంకుల ఆస్తుల నాణ్యతకు మద్దతుగా నిలుస్తుందని వెల్లడించింది.
ఆరోగ్యకర కార్పొరేట్ బ్యాలెన్స్ షీట్లు, మెరుగైన నష్ట నిర్వహణ చర్యలు ఆస్తుల నాణ్యతను మరింత స్థిరపరిచే అవకాశం ఉంటుందని తెలిపింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25)లో ఆర్థిక వృద్ధి 7.2 శాతం నమోదయ్యే అవకాశం ఉందని ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) అంచనా వేసింది. 2023-24లో 8.2 శాతం వృద్ధి నమోదైంది.