Published on Feb 5, 2025
Current Affairs
ఎస్సీ వర్గీకరణకు ఆమోదం
ఎస్సీ వర్గీకరణకు ఆమోదం

తెలంగణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలుకు ఉభయ సభలు ఆమోదం తెలిపాయి. దీంతో సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన తర్వాత దేశంలోనే తొలుత ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పూర్తి చేసిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది.

పంజాబ్‌ ప్రభుత్వం వర్సెస్‌ దవిందర్‌ సింగ్‌ అండ్‌ అదర్స్‌ కేసులో 2024, ఆగస్టు 1న ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది.

తీర్పు అనంతరం ఎస్సీ వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌ ఏకసభ్య కమిషన్‌ నాలుగు సిఫార్సులు చేసింది.

వాటిలో రాష్ట్రంలోని మొత్తం 59 ఎస్సీ కులాలను మూడు గ్రూపులుగా వర్గీకరించడం, ఉద్యోగాల భర్తీ విధానం, రోస్టర్‌ పాయింట్ల విభజన ప్రతిపాదనలను ఆమోదించిన సర్కారు... క్రీమీలేయర్‌ సిఫార్సును తిరస్కరించింది. 

మంత్రిమండలి ఆమోదించిన అనంతరం సంబంధిత నివేదికను 2025, ఫిబ్రవరి 4న శాసనసభ, శాసనమండలిలో ప్రవేశపెట్టింది. రెండుచోట్లా నివేదికకు ఆమోదం లభించింది. దీంతో దాదాపు మూడు దశాబ్దాలుగా వర్గీకరణ కోసం ఎదురుచూస్తున్న వారికి లబ్ధి చేకూరనుంది.

జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌ కమిషన్‌ సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో ప్రాతినిధ్యం ఆధారంగా అత్యంత వెనుకబడిన కులాలను గ్రూప్‌-1లో, మధ్యస్థ లబ్ధిపొందిన కులాలను గ్రూప్‌-2లో, మెరుగైన ప్రయోజనాలు పొందిన కులాలను గ్రూప్‌-3లో చేర్చింది.

2011 జనాభా గణాంకాల ప్రాతిపదికన ఎస్సీ జనాభాలో 61.967% మంది ఉన్న మాదిగ కులంతోసహా 18 కులాలను గ్రూప్‌-2 కింద చేర్చి 9% రిజర్వేషన్లను ప్రతిపాదించింది.

29.26% మంది ఉన్న మాల, మాలఅయ్యవార్‌ కులంతోసహా 26 కులాలను గ్రూప్‌-3లో చేర్చి 5% రిజర్వేషన్లను, ఇక 3.28% మంది ఉన్న 15 కులాలను గ్రూప్‌-1లో చేర్చి ఒక శాతం రిజర్వేషన్లను ప్రతిపాదించింది. 

ఎస్సీ వర్గీకరణపై జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌ కమిషన్‌ 199 పేజీల నివేదిక అందజేసింది. ఇందులో 59 కులాలపై వివరణాత్మక చర్చను పొందుపరిచింది.

2024 నవంబరు 11న బాధ్యతలు స్వీకరించిన కమిషన్‌ 82 రోజుల వ్యవధిలోనే అధ్యయనం చేసి, ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది.

2024 డిసెంబరు 4 నుంచి ఈ ఏడాది జనవరి 3 వరకు రాష్ట్రంలోని పూర్వ జిల్లాల్లో బహిరంగ విచారణ నిర్వహించి ప్రజల నుంచి విజ్ఞప్తులను స్వీకరించి, అభిప్రాయాలను తెలుసుకుంది.

ఎస్సీల్లోని 59 కులాల జనాభా, అక్షరాస్యత, ఉపాధి, విద్యాసంస్థల్లో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు, ఆర్థిక సహాయం, రాజకీయ ప్రాతినిధ్యానికి సంబంధించిన డేటాను అధ్యయనం చేసిన కమిషన్‌ తన నివేదికను రూపొందించింది.