ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీ వర్గీకరణను 2011 జనాభా లెక్కల ప్రాతిపదికన రాష్ట్రం యూనిట్‌గా అమలు చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. వర్గీకరణను జిల్లా యూనిట్‌గా అమలు చేయాలని మొదట భావించింది.
అయితే జిల్లాల విభజన తర్వాత కొత్త జిల్లాల్లో ఎస్సీల జనాభాపై కచ్చితమైన సమాచారం లేనందున రాష్ట్రం యూనిట్‌గా అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. 2026 జనాభా గణన తర్వాత వర్గీకరణను జిల్లా యూనిట్‌గా అమలు చేసే విషయాన్ని పరిశీలించాలని మంత్రివర్గం నిర్ణయించింది.
ఎస్సీ వర్గీకరణను ఏ, బీ, సీ కేటగిరీలుగా విభజించి అమలు చేయనున్నారు. ఏ- కేటగిరీలో రెల్లి, ఉపకులాలకు 1 శాతం రిజర్వేషన్.. బీ కేటగిరీలో మాదిగ, ఉపకులాలకు 6.5 శాతం.. సీ కేటగిరీలో మాల, ఉపకులాలకు 7.5 శాతం రిజర్వేషన్‌ను ప్రతిపాదిస్తూ రాజీవ్ రంజన్ మిశ్ర నేతృత్వంలోని ఏకసభ్య కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదించింది.
విద్య, ఉద్యోగ నియామకాల్లో 200 రోస్టర్ పాయింట్లను ప్రతిపాదించింది. కమిషన్ నివేదికపై అధ్యయనానికి నియమించిన మంత్రుల సంఘం చేసిన సిఫారసుల్ని రాష్ట్ర మంత్రిమండలి 2025, మార్చి 17న ఆమోదించింది.