భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత వృద్ధి రేటు వేగం ఇలాగే కొనసాగితే, తలసరి ఆదాయమూ గణనీయంగా పెరిగి.. 2030 నాటికి భారత్ ఎగువ మధ్య ఆదాయ (అప్పర్ మిడిల్ ఇన్‌కం) దేశాల జాబితాలో చేరుతుందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) రిసెర్చ్ తాజా నివేదికలో పేర్కొంది. 2028 నాటికి జర్మనీని వెనక్కి నెట్టి.. అమెరికా, చైనా తర్వాత ప్రపంచంలోనే మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని స్పష్టం చేసింది.
1990 నుంచి ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల ఆదాయ స్థాయిల్లో వచ్చిన మార్పులు, భారత తలసరి ఆదాయంలో వస్తున్న పెరుగుదలను విశ్లేషిస్తూ ఈ నివేదికను రూపొందించారు.