2024-25 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రాల వృద్ధి రేటును నిర్ధారిస్తూ కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ (ఎంవోఎస్‌పీఐ) ఇటీవల నివేదిక విడుదల చేసింది. 18 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల జీఎస్‌డీపీ, పీసీఐ సమాచారం ఇందులో ఉంది. ఆ వివరాల మేరకు, ఏపీ 8.21 శాతం వృద్ధి రేటును సాధించి.. దేశంలో రెండో స్థానంలో నిలిచింది. 9.69 శాతం వృద్ధి రేటుతో తమిళనాడు మొదటి ర్యాంకులో ఉంది.
స్థిరమైన ధరల వద్ద (2011-12 ధరల ఆధారంగా) ఏపీ స్థూల రాష్ట్ర ఉత్పత్తి (జీఎస్‌డీపీ) రూ.8,65,013 కోట్లకు చేరింది. 2023-24లో జీఎస్‌డీపీ రూ.7,99,400 కోట్లుగా (రాష్ట్ర వృద్ధి రేటు 6.19 శాతం) ఉంది.
ఏపీ ప్రస్తుత ధరల వద్ద గత ఏడాది కంటే 12.02 శాతం వృద్ధి రేటుతో 5వ స్థానంలో ఏపీ నిలిచింది. తమిళనాడు 14.02, ఉత్తరాఖండ్ 13.59 , కర్ణాటక 12.77 , అస్సాం 12.74 శాతాలతో తొలి నాలుగు స్థానాల్లో నిలిచాయి. ఆంధ్రప్రదేశ్ తర్వాత రాజస్థాన్ 12.02, హరియాణా 11.83 , మహారాష్ట్ర 11.73, మేఘాలయ 11.63, జమ్మూ కశ్మీర్ 11.19 శాతాల వృద్ధి రేటుతో మొదటి పది స్థానాల్లో నిలిచాయి. తెలంగాణ (10.12 శాతం) 14వ స్థానంలో ఉంది. ప్రస్తుత ధరల వద్ద ఏపీ జీఎస్‌డీపీ రూ.15,93,062 కోట్లకు చేరింది.