యూనివర్సిటీ ఆఫ్ షికాగోలోని ఎనర్జీ పాలసీ ఇన్‌స్టిట్యూట్ రూపొందించిన ‘ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్’ 2024 వార్షిక నివేదిక 2024, ఆగస్టు 28న విడుదలైంది. దీని ప్రకారం, భారతదేశంలో సూక్ష్మ ధూళి కణాల కాలుష్యం 2021 ఏడాదితో పోల్చితే 2022లో 19.3% తగ్గింది. ఇది ప్రపంచ వ్యాప్తంగా చూస్తే, బంగ్లాదేశ్ తర్వాత రెండో అత్యధికం. దీంతో భారత పౌరుల ఆయుర్ధాయం సగటున ఒక ఏడాది పెరిగింది.
నివేదికలోని అంశాలు:
* భారత్‌లోని అత్యంత కలుషితమైన ఉత్తర మైదానాల్లో 2021తో పోలిస్తే 2022లో 17.2 శాతం కాలుష్య తగ్గుదల నమోదైనప్పటికీ, ఈ ప్రాంతంలో నివసిస్తున్న వారు సుమారు 5.4 సంవత్సరాల ఆయుర్ధాయాన్ని కోల్పోయే అవకాశం ఉంది. మరోవైపు ధూళి కణాల కాలుష్యం స్థాయిల క్షీణత ఇలాగే కొనసాగితే రాబోయే సంవత్సరాల్లో ఇక్కడి వారి ఆయుర్ధాయం 1.2 సంవత్సరాలు పెరుగుతుంది.
* మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లు అత్యధిక కాలుష్య భారాలు మోస్తున్నాయి. దీంతో ఆయా రాష్ట్రాల్లో నివసిస్తున్నవారు 2.9 సంవత్సరాల ఆయుష్షు కోల్పోతున్నారు.
* నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ కింద ఉన్న నగరాలు, జిల్లాల్లో కాలుష్య సాంద్రతలు సగటున 19 శాతం తగ్గాయని నివేదిక తెలిపింది.