మారుతున్న వాతావరణ పరిస్థితుల్లోనూ సౌరఫలకాల నుంచి గరిష్ఠంగా విద్యుత్తును సంగ్రహించేలా కొత్త సాంకేతికతను నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్‌ఐటీ) రవూర్కెలా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.
దీనిపై పేటెంట్‌ను కూడా పొందారు. ఈ ఆవిష్కరణ సూర్యరశ్మి, ఉష్ణోగ్రతల్లో మార్పులకు వేగంగా స్పందిస్తుంది. విద్యుత్ హెచ్చుతగ్గులు లేకుండా మొత్తం వ్యవస్థను సమర్థంగా, స్థిరంగా పనిచేసేలా చూస్తుంది.
సౌరఫలకాలు ఉత్పత్తి చేసే శక్తి ఉష్ణోగ్రత, సూర్యరశ్మి తీవ్రతలో మార్పులకు అనుగుణంగా మారుతుంటుంది. చాలా శక్తి వృథా అవుతుంది కూడా. అయితే ఇలా వృథా కాకుండా వాతావరణ మార్పులకు అంతగా లోనుకాకుండా రోజు మొత్తం స్థిరంగా విద్యుత్తును ఉత్పత్తి చేసేలా కొత్త తరహా మ్యాగ్జిమం పవర్ పాయింట్ ట్రాకింగ్ (ఎంపీపీటీ)ను ఎన్‌ఐటీ రవుర్కేలా శాస్త్రవేత్తలు రూపొందించారు.