తుపానును కచ్చితంగా అంచనా వేసే ఆధునిక పరికరం ‘వేవ్ ప్రొపెల్డ్ వర్టికల్ ప్రొఫైలర్(డబ్ల్యూవీపీ)’ను చెన్నైలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ(ఎన్‌ఐఓటీ) రూపొందించింది. సముద్ర పర్యవేక్షణ, తీర ప్రాంత కార్యకలాపాలకు సంబంధించిన డేటా పొందేందుకు దేశంలోనే మొదటిసారిగా అలల శక్తితో పనిచేసే ‘డబ్ల్యూవీపీ’ని తయారు చేసినట్లు ఎన్‌ఐఓటీ పేర్కొంది. చెన్నై సముద్ర తీరంలో 50 మీటర్ల లోతున విజయవంతంగా దీన్ని పరీక్షించారు.
సముద్రపు నీటి లవణీయత, ఉష్ణోగ్రతలే.. తుపాను ఏర్పడటం, బలపడడం, ప్రయాణించే దిశ, బలహీనపడటం వంటి అంశాలను నిర్ణయిస్తాయి. తుపానుకు సంబంధించిన డేటా సేకరించేందుకు ఇప్పటివరకు సముద్రమట్టం కింద మ్యూరింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసి 10 సెన్సార్ల ద్వారా డేటా పొందుతున్నారు. వేవ్ ప్రొపెల్డ్ వర్టికల్ ప్రొఫైలర్ ద్వారా 12 సెన్సార్లు చేసే పనిని ఒక్క సెన్సార్ ద్వారా చేయొచ్చని ఎన్‌ఐఓటీ తెలిపింది.