భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) 2025, జనవరి 29న దిగ్విజయంగా 100వ ప్రయోగ మైలురాయిని అందుకుంది.
తిరుపతి జిల్లా శ్రీహరికోట సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్)లోని రెండో ప్రయోగ వేదిక నుంచి జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్15 వాహకనౌక నింగిలోకి దూసుకెళ్లి ఎన్‌వీఎస్-02 ఉపగ్రహాన్ని జియోసింక్రనస్ ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్ (జీటీఓ)లో ప్రవేశపెట్టింది.
2,250 కేజీల ఎన్‌వీఎస్-02 స్వదేశీ నావిగేషన్ వ్యవస్థ (నావిక్)లో రెండో జనరేషన్ ఉపగ్రహం. ఇందులో ఉండే ‘రుబిడియం అటామిక్ ఫ్రీక్వెన్సీ స్టాండర్డ్’ అణు గడియారం ఉపగ్రహానికి కీలకమైంది.
భారత్‌తో పాటు చుట్టుపక్కల 1,500 కి.మీ. ఈ ఉపగ్రహం పరిధిలోకి వస్తుంది. ఉపరితల, వాయు, సముద్ర నావిగేషన్, వ్యవసాయం, శాటిలైట్‌ల గమన మార్గం, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ) తదితరాలకు ఎన్‌వీఎస్-02 సేవలు ఉపయోగపడతాయని ఇస్రో పేర్కొంది.