భారతదేశం చుట్టూ మూడువైపులా సముద్రంతో అతిపెద్ద తీర రేఖను కలిగి ఉంది. దీంతో సముద్ర ప్రయోజనాలను కాపాడటం, మారిటైం (అడ్మిరల్టీ) చట్టాలను కచ్చితత్వంతో అమలు చేయడం ముఖ్యం. ఇందుకోసం ఏర్పాటైందే భారత తీర రక్షక దళం (ఇండియన్ కోస్ట్ గార్డ్). భారత తీరాలను సురక్షితంగా ఉంచడంలో, సముద్ర మండలాల్లో నిబంధనలను అమలు చేయడంలో ఇది ముఖ్యపాత్ర పోషిస్తోంది. దీని ఏర్పాటుకు గుర్తుగా ఏటా మన దేశంలో ఫిబ్రవరి 1న ‘భారత తీర రక్షక దళ దినోత్సవం’గా (ఇండియన్ కోస్ట్ గార్డ్ డే) నిర్వహిస్తున్నారు. సముద్ర సమగ్రతను కాపాడటంతోపాటు జాతీయ భద్రతను ప్రోత్సహించడంలో కోస్ట్ గార్డ్ పాత్రను గౌరవించడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.
చారిత్రక నేపథ్యం:
సముద్ర మార్గాల ద్వారా జరుగుతోన్న అక్రమ రవాణాను అడ్డుకోవడం, తీర ప్రాంతాల రక్షణే ధ్యేయంగా భారత ప్రభుత్వం 1977, ఫిబ్రవరి 1న భారత తీర రక్షక దళాన్ని ఏర్పాటు చేసింది. 1978, ఆగస్టు 18న భారత పార్లమెంట్ కోస్ట్ గార్డ్ చట్టం, 1978కి ఆమోదం తెలిపింది. తద్వారా దాని కార్యకలాపాలకు చట్టబద్ధమైన ఫ్రేమ్‌వర్క్ లభించింది. ఇండియన్ కోస్ట్ గార్డ్ ఏర్పాటుకు గుర్తుగా ఏటా ఫిబ్రవరి 1న ‘ఇండియన్ కోస్ట్ గార్డ్ డే’గా నిర్వహించాలని 1978లో భారత ప్రభుత్వం తీర్మానించింది.