చంద్రుడిపై శాశ్వత నిర్మాణాలు చేపట్టే దిశగా బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్‌సీ) పరిశోధకులు కీలక పద్ధతిని అభివృద్ధి చేశారు.
జాబిల్లి ఉపరితలంపై భవనాలు నిర్మించేందుకు ఇటుకలు ఉపయోగిస్తే అవి అక్కడి తీవ్రమైన వేడి, చలి కారణంగా బీటలువారే ప్రమాదముంది.
దీన్ని నివారించేందుకు బ్యాక్టీరియాను ఉపయోగించే పద్ధతిని ఐఐఎస్‌సీ ఆవిష్కరించింది. ఈ మేరకు శాస్త్రవేత్తలు తమ పరిశోధన ఫలితాలను ‘ఫ్రాంటియర్స్ ఇన్ స్పేస్ టెక్నాలజీస్’ అనే జర్నల్‌లో ప్రచురించారు.
చంద్రుడిపై వాతావరణం కఠినంగా ఉంటుంది.
అక్కడ ఉష్ణోగ్రత ఒక్కరోజులో 121 డిగ్రీల సెల్సియస్ దాకా పెరిగి.. మైనస్ 133 డిగ్రీల సెల్సియస్ వరకూ పడిపోతూ ఉంటుంది.
అంతేకాక తీక్షణమైన సౌర పవనాలు, తోకచుక్కలు అక్కడ నిత్యకృత్యమే. అక్కడ భవన నిర్మాణానికి ఉపయోగించే ఇటుకల్లో ‘స్పోరోసార్సినా పాశ్చరీ’ అనే బ్యాక్టీరియాను ఉపయోగించడం ద్వారా తీవ్ర తాపం వల్ల ఇటుకల్లో కలిగే పగుళ్లను నివారించవచ్చని పరిశోధకులు నిరూపించారు.