ఇండోనేసియాలోని సులవేసిలో ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన గుహ చిత్రకళను శాస్త్రవేత్తలు ఇటీవల కనుక్కున్నారు. సున్నపురాయి గుహలో గుర్తించిన ఆ చిత్రాలలో ఒక చేతి గుర్తు కనీసం 67,800 సంవత్సరాల పురాతనమైందని వారు గుర్తించారు. ప్రాచీన చిత్రకళ గురించి ఆలోచిస్తే ముందుగా మనకు జ్ఞప్తికి వచ్చేది స్పెయిన్, ఫ్రాన్స్‌లలోని ప్రసిద్ధ గుహచిత్రాలు.
వీటిని సాక్ష్యంగా చూపుతూ పురాతన మానవ సంస్కృతికి ఆ ప్రాంతాలను ప్రతీకగా భావిస్తారు. ఇండోనేసియాలో కనుగొన్న ఈ కొత్త సాక్ష్యాలు ఈ విషయాన్ని పూర్తిగా మార్చేస్తున్నాయి. ఫ్రాన్స్‌లోని అత్యంత పురాతనమైనదిగా భావిస్తున్న గుహ చిత్రకళ కంటే ఇది 30 వేల సంవత్సరాల కంటే పురాతనమైనది.