- ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2025-26) ఆరోది, చివరిది అయిన ద్వైమాసిక పరపతి విధాన సమీక్షలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) తన కీలక రేట్లను యథాతథంగా కొనసాగించింది. డిజిటల్ మోసాల బారిన పడిన వారికి పరిహారం; సూక్ష్మ- చిన్న, మధ్య తరహా కంపెనీ (ఎంఎస్‌ఎంఈ)లకు హామీ లేని రుణ మొత్తం పెంపు వంటి కీలక ప్రకటనలు చేసింది. అంతర్జాతీయ అనిశ్చితులు పెరిగినా.. అమెరికా-ఐరోపాతో మన దేశానికి కుదిరిన వాణిజ్య ఒప్పందం వల్ల ఆర్థిక వ్యవస్థకు సానుకూలతలు వస్తున్నాయని ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా పేర్కొన్నారు.
- ముఖ్యాంశాలు:
- రెపో రేటు (బ్యాంకులకు ఆర్‌బీఐ ఇచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీ రేటు)ను 5.25% వద్దే కొనసాగించాలని ఆరుగురు సభ్యులున్న పరపతి విధాన కమిటీ (ఎమ్‌పీసీ) ఏకగ్రీవంగా నిర్ణయించింది. ‘తటస్థ’ విధాన ధోరణిని కొనసాగించినందున, కీలక రేట్లు తక్కువ స్థాయుల్లోనే ఉంటాయని, ప్రస్తుతం కంటే తగ్గొచ్చనే సంకేతాలిచ్చింది. 2025 ఫిబ్రవరి తర్వాత 1.25% మేర రేట్లను ఆర్‌బీఐ తగ్గించింది.
- ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యోల్బణ అంచనా (2%)ను, 2.1 శాతానికి ఆర్‌బీఐ సవరించింది. అయినా ఆర్‌బీఐ లక్ష్యిత 4% కంటే ఇది తక్కువే.