సాధారణ ప్రజానీకానికి రాజకీయ సాధికారత అందించడం ద్వారా ప్రగతి సాధించవచ్చనడానికి అద్భుత ఉదాహరణగా భారతదేశ రిజర్వేషన్ విధానం నిలిచిందని ‘‘ఆక్స్‌ఫాం ఇంటర్నేషనల్’’ సంస్థ పేర్కొంది. ప్రపంచ అసమానతలపై ‘ప్రపంచ ఆర్థిక వేదిక’ (డబ్ల్యూఈఎఫ్) 56వ వార్షిక సమావేశాల మొదటి రోజైన జనవరి 19న విడుదల చేసిన నివేదికలో ఈ అంశాన్ని ప్రస్తావించింది.
సామాన్యులతో పోలిస్తే ధనికులు రాజకీయ అధికారాన్ని నిలబెట్టుకునేందుకు అవకాశాలు 4 వేల రెట్లు ఎక్కువని నివేదిక తెలిపింది. అసమానతలు ఎన్ని ఉన్నా ప్రభుత్వ నిర్ణయాలపై ప్రజలు ప్రభావం చూపగల వ్యవస్థాగత, రాజకీయ, సామాజిక పరిస్థితులు ఉన్నప్పుడే సామాన్యులు రాజకీయంగా బలపడగలరని స్పష్టం చేసింది.