ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణను 2025, ఏప్రిల్ 17న అమల్లోకి తెచ్చింది. వర్గీకరణ ప్రక్రియకు సంబంధించిన ముసాయిదా ఆర్డినెన్స్‌కు ఏప్రిల్ 15న మంత్రివర్గం ఆమోదం తెలిపింది. తర్వాత గవర్నర్ కార్యాలయానికి నివేదించగా, ఏప్రిల్ 16న ఆయన దాన్ని ఆమోదించారు. దీంతో అధికారికంగా ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్-2025కి సంబంధించిన గెజిట్ (జీవో 19) నోటిఫికేషన్‌ను న్యాయశాఖ కార్యదర్శి ప్రతిభాదేవి విడుదల చేశారు. తద్వారా ఏప్రిల్ 17 నుంచి వెలువడే నియామక ప్రకటనలు, ప్రభుత్వ ఉద్యోగాల పదోన్నతులు, విద్యా సంస్థల్లో ప్రవేశాలకు వర్గీకరణ అమలు కానుంది. రాష్ట్ర ప్రభుత్వ నియామకాలకు సంబంధించిన బ్యాక్‌లాక్ పోస్టుల భర్తీలోనూ ఈ వర్గీకరణ వర్తిస్తుంది. కేంద్ర ప్రభుత్వంలోని ఏదైనా శాఖకు సంబంధించి పోస్టుల భర్తీ, కేంద్రం ఆధీనంలో ఉండే కార్పొరేషన్లు, ఇతర సంస్థలు, విద్యా సంస్థలకు మాత్రం ఇది వర్తించదు.
59 ఉప కులాలకు లబ్ధి:
రాష్ట్రంలోని షెడ్యూల్డ్ కులాలన్నింటికీ విద్య, ఉద్యోగాల్లో సమాన, న్యాయమైన అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా.. మొత్తం 15 శాతం రిజర్వేషన్లను మూడు భాగాలుగా ఏకసభ్య కమిషన్ విభజించింది. గ్రూప్-1 కింద రెల్లి, ఉపకులాలు (12 కులాలు) చేర్చి 1% రిజర్వేషన్, గ్రూప్-2 కింద మాదిగ, ఉపకులాలు (18 కులాలు) చేర్చి 6.5% రిజర్వేషన్, గ్రూప్-3 కింద మాల, ఉపకులాలు (29 కులాలు) చేర్చి 7.5% రిజర్వేషన్ కేటాయించింది. దీంతో ఎస్సీల్లోని 59 ఉప కులాలకు లబ్ధి చేకూరనుంది. ఈ ప్రక్రియకు 2011 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకున్నారు. రాష్ట్రం యూనిట్‌గా అమలు చేయనున్నారు. తదుపరి జనాభా లెక్కల తర్వాత ఎస్సీ వర్గీకరణను జిల్లా యూనిట్‌గా అమలు చేస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది.